సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల గడువు వున్నా, అప్పుడే ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ పార్టీల నేతలు చెలరేగిపోతున్నారు. ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచేయి సాధించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలకు సంస్కారం లేదని విరుచుకుపడ్డారు.
ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందనే విశ్వాసం, ధైర్యం ఉంటే సార్వత్రిక ఎన్నికల దాకా ఎందుకు.. ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయాలని చంద్రబాబుకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ‘ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయకుంటే.. మీతో సహా మిమ్మల్ని ఛీకొట్టగా మిగిలిన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే దమ్ముందా?’ అని సజ్జల సవాల్ విసిరారు. సజ్జల సవాల్‌పై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.
తన పార్టీ నేతలతో గురువారం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ తమ పార్టీ నేత చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికపై వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచంగా వున్నాయని ధ్వజమెత్తారు. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉప ఎన్నికలో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది తమ పార్టీ విధానమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
గతంలో బద్వేలు ఉప ఎన్నికలో పోటీ పెట్టనట్టే, ఆత్మకూరులో కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ సవాల్ విసిరింది. ఆత్మకూరు బరిలో నిలిస్తే వ్యతిరేకత ఎవరిపై వుందో ప్రజలే తేలుస్తారనేది వైసీపీ భావన. కానీ పోటీకి టీడీపీ వెనుకంజ వేయడం గమనార్హం.