జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిత్యం ఎదురు చూస్తుంటారు. అలాంటిది విమర్శలకు అవకాశం దొరికితే ఊరుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చిన్న అవకాశాన్ని కూడా చంద్రబాబు వదులుకోరు. వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళుతుండగా, ఒంగోలులో ఆర్టీఏ అధికారులు కారు స్వాధీనం చేసుకోవడం తీవ్ర విమర్శలపాలవుతోంది.
ఈ ఘటనలో ఆర్టీఏ అధికారితో పాటు హోంగార్డును ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది. ఈ ఘటన రాజకీయ రంగు పులుము కుంది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత అరాచకమా అని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. టిఫెన్ చేయడానికి కారు నిలిపితే కానిస్టేబుల్ వచ్చి కారు తీసుకెళ్లడం ఏంటని ఆయన నిలదీశారు.
ఆ తర్వాత ఆర్టీఏ అధికారులొచ్చి సీఎం కోసం కారు తీసుకెళ్లామని తీరిగ్గా చెప్పారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లోకి వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా అని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమన్నారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని దుస్థితి రాష్ట్రానికి ఎందుకొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రజల ఆస్తులకు, మహిళల శీలాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అసలు వైసీపీ రాజకీయాల్లో ఉండదగ్గ పార్టీ కాదని అన్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే.. చాలా కోపం వస్తోందని అన్నారు. సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నట్టు చంద్రబాబు అన్నారు.