ఏపీ ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే ఘటన. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళుతున్న కుటుంబానికి ఒంగోలులో తీవ్ర ఇబ్బందులు. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్ కోసం బలవంతంగా కారు, డ్రైవర్‌ను ఆర్టీఏ విభాగం హోంగార్డు తీసుకెళ్లాడు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే… ఉన్నతాధికారుల ఆదేశాలని సమాధానం. ఈ విషయమై మీడియాలో దుమారం చెలరేగడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే…
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో ఇన్నోవా కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమలకు బయల్దేరారు. ఆకలిగా ఉండడంతో ఒంగోలు పాత మార్కెట్ సెంటర్‌కు బుధవారం రాత్రి 10 గంటలకు వెళ్లారు. అక్కడ కారు నిలిపి టిఫెన్ చేస్తున్నారు.
ఈ సమయంలో అక్కడికి రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ విభాగానికి చెందిన హోంగార్డు తిరుపతిరెడ్డి వెళ్లాడు. కారుపై కన్ను పడింది. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్ కోసం కారు కావాలని అడిగాడు. తాము తిరుమలకు వెళుతున్నామని, ప్రజల వాహనాన్ని తీసుకోవాలని అనుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయినా అతను వినిపించుకోలేదు. కారు, డ్రైవర్‌ను పంపాల్సిందేనని పట్టుబట్టాడు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్… మీకు సారీ చెప్పడం తప్ప తామేమీ చేయలేమని డ్రైవర్‌తో సహా తీసుకెళ్లాడు.
దీంతో ఆ రాత్రివేళ ఆ కుటుంబం నడిరోడ్డున నిలవాల్సి వచ్చింది. ఆ సమయంలో మరో వాహనం తీసుకెళ్లాలని అనుకున్నా, కొత్త ప్రాంతం కావడం, సమీపంలో లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో శ్రీనివాస్ కుటుంబం నడిరోడ్డుపై నిలిచింది. చివరికి వినుకొండ నుంచి మరో వాహనాన్ని అర్ధరాత్రి ఒంటి గంటకు తెప్పించుకుని తిరుమలకు వెళ్లారు. ఈ ఘటనపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సంధ్య, హోంగార్డు పి.తిరుపతిరెడ్డి అని గుర్తించారు. వెంటనే వాళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్టీఏ అధికారుల అత్యుత్సాహం చివరికి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. ఇదంతా జగన్ అరాచక పాలనకు నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం గమనార్హం.