ఆచార్య సినిమా విడుదల ఇంక వారం రోజులే వుంది. కానీ సినిమాకు రావాల్సినంత బజ్ రావడం లేదన్నది మెగా ఫ్యాన్స్ టెన్షన్. కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు బయ్యర్ల టెన్షన్ కూడా అదే. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. కానీ బయటకు ఇప్పటి వరకు ఓ పోస్టర్ కూడా లేదు.
మెగా ఫ్యాన్స్ ఎలాగూ బొలోమన వచ్చేస్తారని ధీమా. అది ఓకె. కానీ హడావుడి అయితే వుండాలి కదా? నిర్మాతలు ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ చేతిలో పెట్టి వదిలేసారు. ఆయన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో తలమునకలై వున్నారు. 23 తరువాత కానీ ఆయన కాస్త ఊపిరి పీల్చుకోరు.
ఇప్పటికి ఓ ప్రీ రికార్డెడ్ ఇంటర్వ్యూ తయారు చేసి వదిలారు. కానీ పెద్దగా బజ్ రాలేదు. అలాగే బంజారా పాట వీర వైరల్ అవుతుంది అనుకున్నారు. కానీ కాలేదు. పైగా నాటు నాటు పాటతో పోల్చి దీన్ని పక్కన పెడుతున్నారు. మణిశర్మ ఇచ్చిన ట్యూన్ మైనస్ అయిందని ఫ్యాన్స్ టాక్
మరోపక్కన సినిమా రేట్లు తేలలేదు. రెండు రాష్ట్రాల్లో రేట్లకు అప్లయ్ చేయాల్సి వుంది. రావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అలాగే బయ్యర్ల రేట్లు తేలాలి. అప్పుడేప్పుడో ఫిక్స్ చేసిన రేట్లేనా? అవేమన్నా మారుస్తారా అని బయ్యర్లు ఆశగా చూస్తున్నారు. నైజాం అప్పట్లో 42 కోట్లు అన్నారు. కానీ ఇప్పుడు మార్కెట్ అంత సీన్ వుందా అని అనుమానం.
భీమ్లా నాయక్, పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాల రేంజ్ అయితే ఆ మేరకు లేదు. లేటెస్ట్ గా సర్కారువారి పాట 30 ప్లస్ జీఎస్టీ కి ఇచ్చేసారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ సినిమా కనుక సినిమాకు ఆ మేరకు హడావుడి వుండాలి. అప్పుడే రీచ్ వుంటుంది.
అసలే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ల కోసం వందల కోట్లు జేబుల్లోంచి బయటకు తీసారు ప్రేక్షకులు. ఇప్పుడు ఏ మాత్రం సరైన టాక్ స్ప్రెడ్ కాకున్నా, సరైన బజ్ తేకున్నా అభాసు అవుతుందని మెగాఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.