మార్గదర్శి అక్రమాల్లో విచారణ ఎదుర్కొంటున్న రామోజీరావు, ఆయన కోడలు శైలజకు టీడీపీ మద్దతు ప్రకటించలేదు. ఇది ఆశ్చర్యకర పరిణామమే. నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వ్యవహరిస్తోందని, రాబట్టిన సొమ్మును ఇతరేతర సంస్థలకు మళ్లిస్తోందనే కారణంతో ఏపీ సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రామోజీ, ఆయన కోడలిని ఏపీ సీఐడీ అధికారులు విచారించారు.
త్వరలో వాళ్లిద్దరినీ అమరావతి పిలిపించి విచారించనున్నట్టు సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎవరి కోసమైతో జర్నలిజం నైతిక విలువల్ని రామోజీరావు పణంగా పెట్టాడో, లబ్ధి పొందిన ఆ నాయకుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమైంది. రామోజీకి మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ అనుకూల బీజేపీ నాయకుడు లంకా దినకర్, తాజాగా మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాత్రమే మాట్లాడారు.
మార్గదర్శిపై పని కట్టుకుని తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్‌లు చేయడం నిజమే అయితే, మరెందుకు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు నోరు మెదపడం లేదు. తన కోసం దిగంబరంగా అక్షర నాట్యం చేస్తారని విమర్శలు ఎదుర్కొంటున్న మీడియా యజమానికి చంద్రబాబు మద్దతు ఇవ్వలేదనే చర్చకు తెరలేచింది. అయినదానికి, కానిదానికి జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేయడం తెలిసిందే.
రామోజీరావు లాంటి మీడియాధిపతిపై జగన్ ప్రభుత్వం దాడులు చేస్తుంటే ఇదేం అన్యాయమని చంద్రబాబు ఎందుకు నిలదీయలేకున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతకాలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు మీడియా సంస్థను చంద్రబాబు వాడుకున్నారు. భవిష్యత్‌లోనూ వాడుకుంటారు. కానీ తన కోసం వైఎస్ కుటుంబంతో వైరం పెట్టుకున్న రామోజీకి కష్టకాలంలో తానున్నాననే భరోసా చంద్రబాబు ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ పని చంద్రబాబు బహిరంగంగా చేయలేకపోతున్నారు. ఎందుకిలా? అనేది ఎవరికీ అర్థం కాకుండా వుంది.
ఇంతకాలం రామోజీరావు పెద్ద మనిషి ముసుగులో చెలామణి అవుతూ వచ్చారు. ఎప్పుడైతే విచారణ నిమిత్తం సీఐడీ వెళ్లిందో, ఆ వెంటనే ఆయన మంచం ఎక్కిన ఫొటోలు రామోజీ పరువును బజారున పెట్టాయి. ఓహో రామోజీ అసలు రంగు ఇదన్న మాట అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
రామోజీకి మద్దతు ఇస్తే, రాజకీయంగా నష్టం వస్తుందనే భయం ఏదో చంద్రబాబును వెంటాడుతోంది. అందుకే రామోజీ విషయంలో చంద్రబాబు, లోకేశ్ నోరు కట్టేసుకున్నారు. రాజకీయ నష్టం ఏ రూపంలో అనేది తేలాల్సి వుంది. రామోజీలాంటి వారినే కరివేపాకులా వాడుకుంటున్న చంద్రబాబు స్వార్థ రాజకీయాలను ముఖ్యంగా పవన్ అర్థం చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.