తిరుపతి జిల్లాలో మూడు రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ఖాయమని సమాచారం. సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ సంస్థల సర్వే నివేదికల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కొనసాగింపు, కొత్త అభ్యర్థుల ఎంపికపై ఎప్పటికప్పుడు జగన్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు సంబంధించి మూడు నియోజకవర్గాలపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌ను మార్చడానికి జగన్ నిర్ణయించుకున్నారు.
అలాగే కొత్త అభ్యర్థిగా గూడూరు ఆర్డీవో కిరణ్‌ను నిలబెట్టనున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి పరిచయం కావడంతో పాటు వారికి చేరువ అయ్యేందుకు ఆర్డీవోగా పంపినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గూడూరు ఆర్డీవోగా విధులు నిర్వర్తిస్తూనే చాప కింద నీరులా రాజకీయ కార్యకలాపాలు చేసుకోవాలని కిరణ్‌కు వైసీపీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారని సమాచారం.
ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త మొదలుకుని, మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ అందర్నీ ఆయన అనుమానించే పరిస్థితి. 2014లో సంజీవయ్య రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు స్వాతిముత్యంలో కమల్‌హాసన్ తరహాలో తన అమాయకత్వంతో అందరి అభిమానం చూరగొన్నారు.
ఎమ్మెల్యేగా రెండో దఫా ఎన్నికైన తర్వాత అపరిచితుడి మాదిరిగా సొంత వాళ్లపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
ఈ పరిస్థితుల్లో వైసీపీ మళ్లీ అక్కడ గెలవాలంటే అభ్యర్థి మార్పు తప్ప, మరొక మార్గం లేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నారు. దీంతో సూళ్లూరుపేట కొత్త అభ్యర్థిగా తిరుపతికి చెందిన ఒక డాక్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
వైసీపీ పెద్దల సూచన మేరకు సదరు వైద్యుడు ఆ నియోజకవర్గంలో తరచూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ నియోజకవర్గ వైసీపీ నాయకులు సదరు వైద్యుడితో టచ్‌లో ఉండడం గమనార్హం. అంతేకాకుండా కిలివేటిపై వైసీపీ వ్యతిరేక శక్తులు గళం వినిపిస్తుండడం… అక్కడి రాజకీయాల్లో మార్పునకు నిదర్శనం.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కూడా మార్చనున్నారు. టీడీపీలో వర్గ రాజకీయాలు ఉన్నప్పటికీ ఎంతో ముందుగా అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌ను ప్రకటించారు. ఈమెపై నియోజక వర్గంలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆదిమూలం స్థానంలో ఇద్దరి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒక వైసీపీ ప్రజాప్రతినిధి పేరు కూడా వుండడం గమనార్హం.
ఏది ఏమైనా ఈ మూడు చోట్ల వైసీపీ అభ్యర్థుల్ని మారిస్తేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. రానున్న రోజుల్లో ఇవే కాకుండా మరిన్ని నియోజకవర్గాల్లో మార్పులను కొట్టి పారేయలేం.