ఒక మనిషి ఇంకో రూపంలోకి వెళ్లడం పురాణ కాలం నుంచి వుంది. మనిషికి చిరకాలంగా ఉన్న కోరిక అది. ఇంకా నెరవేరలేదు. పరకాయ ప్రవేశం అంటే ఇంకో శరీరంలోకి వెళ్లి అతనిలా మారడం. అల్లసాని పెద్దన మనుచరిత్ర రాశారు. వరూధిని ప్రవరున్ని ఇష్టపడుతుంది. అతను పడడు. ఒక గంధర్వుడు ప్రవరుని రూపంలో వచ్చి, మాయాప్రవరుడిగా మారుతాడు. గౌతముడి రూపంలో వచ్చి అహల్యని మోసం చేసిన ఇంద్రుడిది ఇదే కథ.
రూపం అదే అయినా ప్రవర్తన మారితే స్ల్పిట్ పర్సనాలిటీ అంటారు. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ నవలని 1886లో స్టీవెన్‌సన్ రాశారు. జెకిల్ అనే పెద్ద మనిషి మిస్టర్ హైడ్ అనే దుర్మార్గునిగా వ్యవహరిస్తాడు. స్ల్పిట్ పర్సనాలిటీ. అపరిచితుడు, ఎర్రగులాబీలు ఇలా చాలా సినిమాలకి మూలం ఇదే. 1974లో సైతాన్ అనే హిందీ సినిమా వచ్చింది. శత్రుఘ్న సిన్హా పోలీస్ ఆఫీసర్. ఒక సీరియల్ కిల్లర్ వేటలో వుంటాడు. అనుమానంతో తన స్నేహితున్నే అరెస్ట్ చేస్తాడు. అయితే ప్రత్యక్ష సాక్షి ఏం చెబుతుందంటే పోలీస్ ఆఫీసరే, సీరియల్ కిల్లర్ అని. అప్పట్లో ఇదే మంచి థ్రిల్లర్.
1973లో దేశోద్ధారకులు వచ్చింది. సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్‌లు వుంటారు. డబుల్ రోల్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతాం. చివర్లో ప్రభాకర్‌రెడ్డి అతి కష్టమ్మీద మాస్క్ తీసి ట్విస్ట్ ఇస్తాడు. మాస్క్‌లతో మరో రూపంలోకి వెళ్లడం అప్పటి క్రైమ్ సినిమాల క్లైమాక్స్ ట్విస్ట్. దీనికి లాజిక్ ఏమీ వుండదు. సినిమాటిక్ లిబర్టీ.
వీటన్నింటికంటే ముందు 1965లో హ్యూమన్ డూప్లికేటర్స్ వచ్చింది. అందులో ఒకడు మర్డర్లు చేస్తే, పోలీసులు కాలుస్తారు. బుల్లెట్లు తగిలినా ఏమీ కాదు. విషయం ఏమంటే అతను ఒక రోబో. ఒక సైంటిస్ట్ డూప్లికేట్ మనిషిని తయారు చేసి, అసలు వ్యక్తుల్ని హత్య కేసుల్లో ఇరికిస్తూ వుంటాడు.
ఈ కథలకి ఇంత చరిత్ర వుంటే ఇదేమీ పట్టించుకోకుండా వించి దా (2019) బెంగాలీ సినిమా నుంచి మేకప్ సామగ్రి తెచ్చుకుని రావణాసుర తీసి మనముందు ఉంచారు. థ్రిల్లింగ్ పాయింట్ మామూలుగా వుండదని హైప్ క్రియేట్ చేశారు. ఫస్టాఫ్‌కి ముందే అది చెప్పేసి సెకెండాఫ్ ప్రేక్షకున్ని నాన్ థ్రిల్‌కి గురి చేసి, సినిమా అయిపోతుందని అనుకున్నప్పుడు ఐటమ్ సాంగ్ పెట్టి కకావికలు చేశారు.
మేకింగ్, ట్విస్టుల మీద శ్రద్ధ పెట్టి కథలో ఎమోషన్‌ని మరిచిపోయారు. ఇది రైటింగ్ వైఫల్యం. ప్రేక్షకుల్ని షాక్‌కి గురి చేద్దామనుకుని దర్శకుడు, రచయిత తామే కరెంట్ వైర్ పట్టుకున్నారు.
రవితేజ నెగెటివ్ షేడ్‌లో భలే వున్నాడనుకున్నారు కానీ, ఒక మంచి పని కోసం ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి తానే దుర్మార్గుడిగా మారిపోతున్న విషయాన్ని దర్శకుడు కన్వీనియంట్‌గా మరిచిపోయాడు. అందుకే తెర మీద ఏం జరిగినా మనం ఫీల్ కాము.
కాలేజీలో తాను ప్రేమించిన అమ్మాయి దగ్గర జూనియర్‌గా చేరి ప్రేమగా వుంటూ ఆమె లైఫ్‌ని కష్టాల్లో పడేస్తాడు. ఇంకో హీరోయిన్‌ని ఎలా ఫినిష్ చేస్తాడో తెలిసి కూడా ఆమెతో డ్రీమ్ సాంగ్ పాడతాడు. దర్శకుడి బ్యాడ్ టేస్ట్.
సినిమాకి కీలకమైన మెడికల్ మాఫియా కూడా సిల్లీగా వుంది. మెటఫార్మిన్ కాంబినేషన్‌తో ప్రతి చెత్త కంపెనీ కూడా డయాబెటీస్ టాబ్లెట్లు తయారు చేస్తుంది. ఆ ఎరీనాలో వందల, వేల కోట్ల లాభాలు రావు.
కథ రాసుకున్నప్పుడు, వింటున్నప్పుడు ఎగ్జైట్‌గానే వుంటుంది. స్క్రీన్ మీద అన్ని పాత్రలు వస్తూ అవన్నీ ఎక్కడా రిజిస్టర్ కాకుండా, సినిమాలో ట్రావెల్ కాకుండా డ్రాప్ అవుతూ వుంటాయి. సుశాంత్‌ని చూస్తే పాపం అనిపిస్తుంది. అతనిలో టాలెంట్ వుంది. అది బయటకు వచ్చే క్యారెక్టర్ దొరకడం లేదు.
పోలీస్ అధికారి జయరామ్‌కి కిల్లర్ ఎవరో తెలిసినా చట్టం గురించి పాయింట్లు వెతుకుతూ వుంటాడు. నేరం చేయని వాళ్లతో కూడా, చితకబాది నేరం ఒప్పించే పోలీసులు, కిల్లర్ తెలిసి కూడా సెక్షన్లు ఆలోచిస్తారా? అది కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని జూనియర్ లాయర్ విషయంలో.
లాజిక్కులు పక్కన పెడితే, ఇప్పుడు కావాల్సింది గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. అండర్ కరెంట్‌గా ఎమోషన్ క్యారీ అవుతూ వుండాలి. అది లేకపోతే ఎన్ని వున్నా ప్రభాస్ సాహో అవుతుంది.
ఖిలాడి రిజల్ట్ ముందే తెలుసని రచయిత శ్రీకాంత్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఇది ఒక రకంగా దర్శకుడు రమేశ్ వర్మని తక్కువ చేసినట్టే.
హిట్లు, ప్లాప్‌లు ముందే తెలియడం నిజంగా బ్రహ్మ విద్యే. అది తెలిసిన శ్రీకాంత్‌కి రావణాసుర ఎందుకు తెలియకుండా పోయిందో!
పది తలల రావణుడు, ఒక తల ప్రేక్షకుడి మీద పడితే ఎట్టా సామీ!
జీఆర్ మహర్షి