మామ ఎన్టీఆర్ పట్ల చంద్రభక్తి ఒక బూటకం!

తెలుగుజాతి అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు.. కేవలం చంద్రబాబునాయుడుకు మామ మాత్రమే కాదు. ఓటమి పాలైన ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన దేవుడు. ఏ పార్టీకి తాను పెత్తందారుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారో.. ఆ…

తెలుగుజాతి అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు.. కేవలం చంద్రబాబునాయుడుకు మామ మాత్రమే కాదు. ఓటమి పాలైన ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన దేవుడు. ఏ పార్టీకి తాను పెత్తందారుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారో.. ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. అలాంటి నందమూరి తారక రామారావు పట్ల చంద్రబాబుకు ఉన్న భక్తి ఎంత అంటే మాత్రం ప్రశ్నార్థకమే.

ఎందుకంటే.. ఎన్నికల సమయంలో రామారావు పేరును స్మరించుకోవడం, సభలు పెట్టినప్పుడు ఆయన విగ్రహానికి ఒక మాల వేయడం, ఆయన జయంతి నాడు మహానాడు నిర్వహించడం తప్ప చంద్రబాబుకు ఆయనకు చేసేదేమీ ఉండదు. అయితే ఈసారి రామారావు జయంతిని కూడా చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా స్కిప్ చేశారు.

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా కంటగింపుగా ఉంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. చంద్రబాబునాయుడు గుట్టుచప్పుడు కాకుండా అమెరికాకు కుటుంబం సహా వెళ్లిపోయారు.

ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తాయి కాబట్టి.. ఈ ఏడాది మహానాడు కార్యక్రమం రద్దు చేసుకుని.. ఎన్టీఆర్ జయంతికి నిర్వహించే వేడుకను కూడా లేకుండా చేశారు. ఓటమి భయం ఉన్నదేమో.. ఫలితాలకు ముందు వేడుక చేసుకుంటే జనం నవ్వుతారని భయపడి ఉండవచ్చు. కానీ.. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో స్వయంగా పాల్గొని ఘనంగా నిర్వహించడానికి ఏమొచ్చింది అనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబునాయుడుకు కనీస శ్రద్ధ లేదనే విమర్శలు వస్తున్నాయి.

పోలింగ్ ముగిశాక అమెరికాలో విహార యాత్రకు వెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్ జయంతినాటికి తిరిగి రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు విదేశీయాత్ర నుంచి బుధవారం తిరిగి వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం ఒక్కరోజు ముందు వచ్చి ఉంటే.. ఎన్టీఆర్ పట్ల భక్తిని ప్రకటించే అవకాశం ఉండేది కదా అని పార్టీ వారు అంటున్నారు. చంద్రబాబునాయుడు ఎవ్వరినైనా వాడుకుని వదిలేసే టైపు అని.. ఎన్టీఆర్ విషయంలో కూడా అంతేనని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు కలగంటున్నట్టుగా మళ్లీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. రాబోయే అయిదేళ్లలో ఎన్టీఆర్ ను జనం మరచిపోయేలా చేస్తారని కూడా అనుకుంటున్నారు.