వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు. దాని కోసం వయసును కూడా లెక్కచేయకుండా ఆయన ఏపీ అంతా పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు వైసీపీని అధికారంలోకి రానీయకూడదు అన్న పంతం ఉంది.
వైసీపీలోని కొందరు నాయకులు, మంత్రులు, మాజీ మంత్రుల మీద టార్గెట్ ఉంది. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు వంటి వారితో పాటు గుడివాడ అమరనాధ్ కూడా టీడీపీ హిట్ లిస్ట్ లో ఉన్నారని ప్రచారంలో ఉన్న మాట.
గుడివాడ అమరనాధ్ విశాఖకు చెందిన వైసీపీ యువ మంత్రి. జగన్ కి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు వయసులో సగం ఉన్న గుడివాడ ప్రెస్ మీట్ పెడితే చాలు బాబు మీద చెలరేగిపోయి చెడుగుడు ఆడుకుంటారు. గుడివాడ దూకుడుకి కళ్ళెం వేసేవారు లేరని చెప్పాలి.
బలమైన సామజిక వర్గం నేపధ్యం, రాజకీయంగా చురుకుదనం జగన్ ఇస్తున్న ప్రోత్సాహం గుడివాడను చిన్న వయసులోనే ధీటైన నేతగా మార్చేశాయి. గుడివాడ పూర్వాశ్రమంలో టీడీపీలో కార్పోరేటర్ గా చేశారు. జగన్ ఆయన్ని ఎంపీ అభ్యర్ధిగా చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారు.
అలా ఒక్కసారి గుడివాడ రాజకీయ స్థాయి తాహతు పెరిగిపోయింది. తమ్ముళ్ళు మాత్రం గుడివాడకు చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టారు అని అంటూంటారు. గుడివాడ అనుచరులు మాత్రం దాన్ని ఖండిస్తారు. గుడివాడ తాత నుంచి తండ్రి దాకా ఎమ్మెల్యేలు మంత్రులు అయిన చరిత్ర ఉందని గుర్తు చేస్తారు. గుడివాడకు ఉన్నత పదవులు ఇచ్చింది జగన్ అయితే ఈ రాజకీయ బిక్ష మాటలేంటి అని కౌంటర్లు వేసారు.
ఉత్తరాంధ్రా టూర్ పెట్టుకుని మూడు రోజుల పాటు పర్యటిస్తున్న చంద్రబాబు అనకాపల్లిలో గుడివాడ అమరనాధ్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టబోతున్నారు. అమరనాధ్ మీద ఆయన రాజకీయ వేడి మాటల దాడి చూపించనున్నారు. గుడివాడను అపుడే తమ్ముళ్ళు సవాళ్లు చేస్తున్నారు. చంద్రబాబు స్పీచ్ ఎలా ఉండబోతోందో రుచి చూపిస్తున్నారు.
యువ మంత్రితో పెట్టుకుంటే డైలాగ్ వారే అని అనుచరులు అంటున్నారు. బాబు గుడివాడను టార్గెట్ చేస్తున్నారు. అనకాపల్లిలో రాజకీయ అగ్గిని టీడీపీ రాజేస్తే వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా. గుడివాడ గడబిడ చేయడం ఖాయమనే అంటున్నారు.