ఈమధ్య సినిమాల ప్రమోషన్స్ కోసం స్టార్స్ ను తీసుకురావడం ట్రెండ్ గా మారింది. క్రేజీగా ఇంటర్వ్యూలు చేసి మూవీకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొన్ని క్లిక్ అవుతుంటే, మరికొన్ని బెడిసికొడుతున్నాయి.
మొన్నటికిమొన్న రామబాణం ప్రచారం కోసం గోపీచంద్ ను దర్శకుడు తేజ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ప్రోమోకే భూమి బద్దలైంది. దీంతో ఇంటర్వ్యూ మొత్తాన్ని అడ్డంగా నరికేసి, చప్పగా మార్చేసి యూట్యూబ్ లో వదిలారు. ఇప్పుడు అలాంటిదే మరో ఇంటర్వ్యూ వచ్చింది.
అన్నీ మంచి శకునములే సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది యూనిట్. సిద్ధూకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, సినిమాకు హైప్ వస్తుందనుకున్నారు. తీరా చూస్తే, తన మాటతీరుతో, సెటైరికల్ డైలాగ్స్ తో సినిమాతో పాటు.. యూనిట్ పరువు తీశాడు సిద్ధు.
ఓ సందర్భంలో సినిమా జానర్ గురించి మాట్లాడుతూ, లవ్-ఎమోషన్-ఫ్యామిలీ-కామెడీ.. ఇలా చెప్పుకుంటూ పోతూ ఫాంటసీ కూడా కలిపేయలేకపోయావా అంటూ దర్శకురాలిపై వెటకారం చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. మరో సందర్భంలో 'నువ్వేంది ఎప్పుడూ ఒకే లాంటి పాత్రలు చేస్తావ్' అంటూ మాళవికను ట్రోల్ చేశాడు. ఆమె చేసే పాత్రలు, సినిమాలు ఎలా ఉంటాయో సుదీర్ఘంగా కామెడీగా చెప్పుకొచ్చాడు. 'అన్నీ మంచి శకునములే' కూడా అలాంటిదేనా అంటూ చివర్లో మరో పంచ్.
ఇక హీరో సంతోష్ శోభన్ అయితే సిద్ధూ దెబ్బకు ఒక దశలో బిక్కమొహం పెట్టాడు. 'అసలు నువ్వు మూవీస్ ఎందుకు చేస్తున్నావ్' అనేది ఎదురుగా ఉన్న హీరోకు, ఈ హీరో వేసిన ప్రశ్న. దీంతో మనోడు కొన్ని సెకెన్లు సైలెంట్ అయ్యాడు.
చూస్తుంటే, యూనిట్ కూడా ఈ ఇంటర్వ్యూను అంతే తేలిగ్గా తీసుకున్నట్టుంది. మధ్యమధ్యలో ఎమోజీలు, బ్రహ్మానందం కామెడీ క్లిప్పులు వేసి ఫన్ జనరేట్ చేసే ప్రయత్న చేసింది. రన్ టైమ్ చూస్తుంటే, ఈ ఇంటర్వ్యూకు కూడా బాగా కోతలు పడినట్టున్నాయి.
అంతా ఓకే కానీ, సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు “సినిమాలో ఏముంటది.. అదే అంకుల్.. అదే ఆంటీ.. అదే సోషల్ డ్రామా.. అంతేగా..” అంటూ సిద్ధూ జొన్నలగడ్డతో చెప్పించడం, దానికి హీరోహీరోయిన్, డైరక్టర్ నవ్వడం మాత్రం బాగాలేదు.