విశాఖ అందాన్ని పొగిడితే సరిపోతుందా…?

విశాఖ అందమైనది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే అందంగా విశాఖ ఉంది కదా అని అభివృద్ధి కూడా చూడాలి కదా. విశాఖ వచ్చిన ప్రతీ వారూ వాహ్ అందమైన సిటీ అంటూంటారు. టూరిస్టులు…

విశాఖ అందమైనది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే అందంగా విశాఖ ఉంది కదా అని అభివృద్ధి కూడా చూడాలి కదా. విశాఖ వచ్చిన ప్రతీ వారూ వాహ్ అందమైన సిటీ అంటూంటారు. టూరిస్టులు అయితే విశాఖ మీద మోజు పడతారు. కానీ విశాఖ అందం గురించి కేంద్ర మంత్రులు కూడా షరా మామూలుగా మాట్లాడేసి పొగిడేసి వెళ్ళిపోతే ఎలా అని అంటున్నారు. విశాఖను అందంతో పాటు అన్ని విధాలుగా అగ్రగామిగా నిలబెట్టాలని అంతా కోరుతున్నారు.

విశాఖకు గతంలో వచ్చిన కేంద్ర మంత్రులు అయితే బ్యూటిఫుల్ సిటీ అనేసి జనాల నోట్ల పంచదార లాంటి మాటలను పెట్టేసి తీపి చేసి వెళ్ళిపోయారు. తాజాగా కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ విశాఖ వచ్చారు. ఆయన విశాఖను చూసి వాటే బ్యూటీ అని ఉప్పొంగిపోయారు.

అందంతో పాటు పరిశుభ్రమైన సిటీ విశాఖ అని తెలుగులోనే నాలుగు మంచి మాటలు చెప్పారు. విశాఖ బ్యూటీ గురించి ఆయన చెప్పిన మాటలను జనాలు ఆనందంతో స్వీకరిస్తున్నారు. అందమైన సిటీకి విశాఖ ఉక్కు కర్మాగారం గర్వకారణం. మరి దాన్ని నిలబెట్టి ప్రభుత్వం రంగంలో కొనసాగిస్తారా అని అడుగుతున్నారు.

విశాఖకు రైల్వే జోన్ అన్నది ఒక కల. అది సాకారం కాకుండా దశాబ్దాలు గడచిపోతున్నాయి. దాని సంగతేంటి అంటున్నారు. విశాఖలో ఎన్నో సదుపాయాలు ఉన్నాయని, మెట్రో రైల్ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలు ఎక్కలేదని గుర్తు చేస్తున్నారు.

విశాఖకు కొత్త ప్రాజెక్టులు కేటాయించడం, దేశంలోనే నంబర్ వన్ సిటీగా చేయడంతో కేంద్రం తన పాత్రను తప్పకుండా పోషిస్తే విశాఖ ఇంకా అందంగా మెరుస్తుంది కదా కేంద్ర మంత్రులూ అని సూచిస్తున్నారు. విశాఖ వచ్చి పోవడం కాదు కాస్తా అయినా ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోవాలని కోరుతున్నారు. మాటలదేముంది ఎన్నో చెప్పవచ్చు. కానీ విశాఖను ప్రగతిబాటన పట్టించే వారినే జనాలు కూడా గుర్తు పెట్టుకుంటారు అని అంటున్నారు.