గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో చంద్రబాబు ఉన్నారు. ఇక వైసీపీ పని అయిపోయిందనే భ్రమలో ఆయన ఉన్నారు. తమ విజయానికి సహకరించారనే ఉద్దేశంతో సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ రథసారథులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఆయన ఓ పార్టీని మరిచిపోయారా? లేక ఇతరులకు కోపం వస్తుందని ఉద్దేశ పూర్వకంగానే విస్మరించారా? అనేది చర్చనీయాంశమైంది.
రెండో ప్రాధాన్యత ఓట్లు టీడీపీ అభ్యర్థులకు వేసినా, తమకు కనీసం కృతజ్ఞతలు చెప్పకపోవడంపై బీజేపీ నేతలు హర్ట్ అయ్యారు. ఇదేంటి… మూడు గ్రాడ్యుయేట్స్ స్థానాల్లో తమ పార్టీ అభిమానులంతా అత్యధికంగా టీడీపీకి మద్దతు పలికారని, కానీ చంద్రబాబు ఆ విషయాన్ని మరిచిపోవడం ఏంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు రాజకీయ అవసరాలను బట్టి వ్యవహరిస్తుంటారనేందుకు ఇదే నిదర్శనమని వారు అంటున్నారు.
కానీ అధికారికంగా వామపక్షాలు, టీడీపీ మధ్య ఓ అవగాహన కుదిరింది. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను పరస్పరం వేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఆ ప్రకారం ఓట్ల బదిలీ జరిగింది. ఇక జనసేనాని పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… వైఎస్ జగన్ పార్టీని ఓడించాలని అధికారికంగా పిలుపునిచ్చారు. టీడీపీ, వామపక్ష పార్టీలకు ఓట్లు వేయాలని పిలుపునిస్తే… మిత్రపక్షమైన బీజేపీకి కోపం వస్తుందని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
బీజేపీకి మద్దతు విషయంలో పవన్‌కల్యాణ్ పొత్తు ధర్మం పాటించలేదు. అయినప్పటికీ ఆ విషయమై ఇరు పార్టీల నేతలు నోరు తెరవడం లేదు. బీజేపీ పిలుపుతో సంబంధం లేకుండా రెండో ప్రాధాన్యం ఓట్లు మాత్రం టీడీపీ మద్దతుదారులకు బదిలీ కావడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బాబు మాత్రం అంతిమంగా అన్ని పార్టీల నుంచి లబ్ధి పొందడం విశేషం.