మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎలా వుందో కానీ, ఆయన మాటలు వినే వాళ్లు సిగ్గుపడుతున్నారు. నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవం ఆయన సొంతం. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఘన చరిత్ర తనదని ఇటీవల ఆయనే చెప్పుకున్నారు. అలాగే సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆయన ప్రతిపక్ష నేతగా పాలకపక్షంపై నిప్పులు చెరుగుతున్నారు. విధానాల పరంగా ఏం మాట్లాడినా ఎవరికీ అభ్యంతరం వుండదు.
అయితే తన తప్పును కూడా ప్రత్యర్థులపై వేయడానికి ఆయన సర్కస్ ఫీట్లు చేయడం గమనార్హం. కందుకూరులో 8 మందిని పోలీసులే చంపారని ఆరోపించడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఇలాంటి సిగ్గుమాలిన, నీతిబాహ్యమైన ఆరోపణలు చంద్రబాబు తప్ప మరెవరూ చేయరు, చేయలేరని ప్రత్యర్థులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంకా నయం బాబు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చావుకు కూడా నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగనే కారణమని ఆరోపించలేదనే సెటైర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో బాబు చివరి రోజు పర్యటనలో ఏమన్నారంటే… “నా సొంత నియోజకవర్గంలో పర్యటనను అడ్డుకునేందుకు 2వేల మంది పోలీసులు వచ్చారు. కందుకూరులో కనీసం 20 మంది రాలేదు. పోలీసులకు సిగ్గనిపించట్లేదా? అక్కడ కుట్ర చేసి ప్రజల్ని చంపేసి, తిరిగి నా మీదే కేసులు పెడుతున్నారు” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పర్యటనల్ని అడ్డుకోవాలనే ఉద్దేశమే వుంటే… కందుకూరులో మాత్రం ఆ పని పోలీసులు ఎందుకు చేయలేదు? కందుకూరులో కేవలం 20 మంది పోలీసులున్నారంటే… బాబు పర్యటనను స్వేచ్ఛగా చేసుకోనివ్వాలనే ఉద్దేశం కనిపించలేదా? కందుకూరులో తన పర్యటనలో జరిగిన తొక్కిసలాటలో అమాయకులైన 8 మంది ప్రాణాలు కోల్పోయారనే సంగతి చంద్రబాబు మరిచినట్టున్నారు.
అలాగే గుంటూరులో కూడా తమ అజాగ్రత్త వల్లే ఏ పాపం ఎరుగని ముగ్గురు పేద మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఇందుకు పశ్చాత్తాపం చెందానే కనీస సంస్కారం కూడా చంద్రబాబులో కనిపించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తన సభల్లో తొక్కిసలాటకు కూడా ప్రభుత్వాన్ని, పోలీసుల్ని బాధ్యుల్ని చేయడం చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనలకు అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నందుకు తమరు సిగ్గుపడాలా? లేక పోలీసులా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.