ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయి. నిత్యం ఏదో ఒక అంశం వివాదాస్పదం అవుతూనే వుంది. ఐదారు రోజులుగా జీవో నంబర్-1పై వివాదం కొనసాగుతోంది. కోటి విద్యలు కూటి కోసమే అనే చందంగా… ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం పాలకప్రతిపక్ష నేతలు ఆడుతున్న నాటకాలనే విమర్శ బలంగా వుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో సరైన అభ్యర్థులను నిలిపేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ, వైసీపీ విస్తృతమైన సర్వేలు చేయిస్తున్నాయి.
విడతల వారీగా చేస్తున్న సర్వేల్లో అభ్యర్థుల బలాబలాలను ఎప్పటికప్పుడు అధినేతలు అంచనా వేస్తున్నారు. ఈ దఫా ఎన్నిక లను వైసీపీ, టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ, వైసీపీలకు రానున్న ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఏ మాత్రం అటూఇటూ అయినా శాశ్వతంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం టీడీపీ, వైసీపీ అధినేతలకు పట్టుకుంది. దీంతో ఏ చిన్న తప్పునకు అవకాశం ఇవ్వకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు చంద్రబాబు, జగన్ కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు పానకంలో పుడకలా జనసేనాని పవన్‌కల్యాణ్ తయారయ్యారని టీడీపీ అసహనంగా వుంది. పొత్తుపై పవన్ వ్యాఖ్యలు ఒక్కోసారి ఒక్కోలా వుంటున్నాయి. దీంతో పవన్ నమ్మకస్తుడైన నాయకుడు కాదనే అభిప్రాయంలో టీడీపీ వుంది. పవన్‌తో పొత్తు సంబంధం లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇప్పటికే పలువురికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కొంచెం తేడా ఉందనిపిస్తే పెండింగ్‌లో పెడుతున్నారు.
ఇదిలా వుండగా టీడీపీ, వైసీపీ చేయిస్తున్న సర్వేలపై ఇరు పార్టీల నేతలు ఆసక్తి బరుస్తున్నారు. ఒకవేళ ఉన్న పార్టీలో సీటు దక్కకపోతే పక్క పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. రాజకీయాల్లో ఉన్న తర్వాత అధికారం తర్వాతే ఎవరైనా, ఏమైనా అనే లెక్కాచారం వుండనే వుంది. దీంతో విలువలు, సిద్ధాంతాలు అనే పట్టింపులకు నాయకులు పోవడం లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఆ తాను ముక్కలే అని చెప్పక తప్పదు.
సర్వేల్లో తమకు అనుకూలంగా లేదని, టికెట్ రావడం కష్టమనే పక్కా సమాచారం వస్తే… మరో బలమైన పార్టీలో ప్రయత్నాలు మొదలు పెట్టడానికి నాయకులు ఏ మాత్రం వెనుకాడరు. ఇప్పటి నుంచి ఇతర పార్టీల నేతలతో ఎందుకైనా మంచిదని టచ్‌లోకి వెళుతున్నట్టు సమాచారం. ఫైనల్‌గా సర్వే రిపోర్ట్‌లే తమ భవిత తేల్చనుండడంతో వాటి నివేదికలను తెలుసుకోడానికి నాయకులు నానా తంటాలు పడుతున్నారనేది నిజం. ఈ సందర్భంగా ఉన్నవి, లేనివి కూడా ప్రచారంలోకి వస్తుండడంతో నేతలు చికాకు పడుతున్నారు.