Advertisement

Advertisement


Home > Politics - Analysis

భార‌త క్రికెట్.. అంతా గుజ‌రాత్ మ‌యమైందా..!

భార‌త క్రికెట్.. అంతా గుజ‌రాత్ మ‌యమైందా..!

బీసీసీఐ భ్ర‌ష్టుప‌ట్టింద‌నేమాట కొత్త కాదు. చాలా కాలం నుంచినే ఈ అభిప్రాయాలున్నాయి. దేశంలో క్రికెట్ చుట్టూ ధ‌నం ఎప్పుడైతే పోగైందో, క్రికెట్ మోస్ట్ గ్లామ‌ర‌స్ ఎప్పుడు అయ్యిందో అప్ప‌టి నుంచి బీసీసీఐ చుట్టూ రాజ‌కీయ నేత‌లు చేరారు. విప‌రీత స్థాయి రాజ‌కీయం చోటు చేసుకోవ‌డం మొదలైంది. దేశంలో వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డుల‌కు ఆయా రాష్ట్రాల రాజ‌కీయ నేత‌లే బాస్ ల‌య్యారు! సౌత్ లో ఈ జాడ్యం పెద్ద‌గా లేదు. అయితే నార్త్ లో చాలా రాష్ట్రాల్లో క్రికెట్ ను రాజ‌కీయ నేత‌లు త‌మ పెర‌డులో క‌ట్టేసుకున్నారు. 

గ‌తంలో కొంద‌రు రాజ‌కీయ నేత‌లు ఏకంగా బీసీసీఐ ప్రెసిడెంట్ ప‌ద‌వినే తీసుకున్నారు. మ‌హారాష్ట్ర క్రికెట్ లో తీవ్రంగా ఇన్ వాల్వ్ అయ్యి, ఆ త‌ర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాడు శ‌ర‌ద్ ప‌వార్. కేంద్రంలో యూపీఏ స‌ర్కారు ఉన్న‌ప్పుడు భార‌త క్రికెట్లో ప‌వార్ ఏం చెబితే అది జ‌రుగుతోంద‌నే అభిప్రాయాలు వినిపించాయి. అదే స‌మ‌యంలో బీజేపీ వైపు నుంచి అరుణ్ జైట్లీ లాంటి వాళ్లు ఢిల్లీ క్రికెట్ ను శాసించారు. బీసీసీఐ వ్య‌వ‌హారాల్లో పాలుపంచుకున్నారు. రాజ‌కీయంగా విబేధించుకున్నా అలా క్రికెట్ పై ఆధిప‌త్యం విష‌యంలో రాజ‌కీయ పార్టీల నేత‌ల‌న్నీ ఏకం కావ‌డం కొత్త కాదు.

మ‌రి కాంగ్రెస్ అంటే దురాగ‌తాల పార్టీ అనుకుందాం. మ‌రి ఇప్పుడు కూడా ప‌రిస్థితి అంత‌క‌న్నా భిన్నంగా లేదు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా త‌న‌యుడు జై షా బీసీసీఐని అంతా తానై న‌డిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు క్రీడ‌ల‌ను కూడా రాజ‌కీయ‌మ‌యం చేశార‌ని బీజేపీ వాళ్లు ఆరోపించ‌డానికి కూడా ఏమీ మిగ‌ల్లేదు. ఇప్పుడు బీసీసీఐ కోశాధికారిగా జైషా అంతా తాన‌వుతున్నారు. గ‌తంలో కోశాధికారులు బీసీసీఐకి ఉండే వారు కానీ, జై షా అంత స్థాయిలో వారి పేర్లు మార్మోగ‌లేదు. 

ఇప్పుడు బీసీసీఐలో ఏం జ‌రిగినా అంతా జై షా పుణ్య‌మే అని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. దీన్ని పాజిటివ్ ప్ర‌చారంగా మ‌లుచుకుంటూ ఉన్నారు. అయితే లోథా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా చూస్తే.. ఇప్పుడు జై షా కూడా ఆ ప‌ద‌వి నుంచి వైదొల‌గాలి క‌దా! అంటే మాత్రం ఆ త‌ర్వాత వాద‌న మారిపోతుంది. లోథా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా గంగూలీని బీసీసీఐ అధ్య‌క్ష హోదా నుంచి త‌ప్పించిన‌ప్పుడు జై షా కూడా త‌ప్పుకోవాలి క‌దా! అని ఎవ్వ‌రూ వాదించ‌రాదు. అదేమంటే రోజ‌ర్ బిన్నీని బీసీసీఐ ప్రెసిడెంట్ గా చేశారు అనే మ‌రో వాద‌న. అది జై షా పెద్ద మ‌న‌సు కాబోలు! అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ పేరు క‌న్నా కోశాధికారి పేరే అమితంగా వినిపిస్తోందిప్పుడు.

ఇక జ‌ట్టులో స‌భ్య‌త్వాల విష‌యంలో కూడా ఈ ప్ర‌భావం లేక‌పోలేద‌నే వాద‌నా ఉంది. భార‌త క్రికెట్ జ‌ట్టుకు ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ గా దాదాపు అప్ర‌క‌టిత‌శాశ్వ‌త కెప్టెన్ ను చేసేశారు హార్దిక్ పాండ్యాను. పాండ్యాకు నిజంగా కెప్టెన్ గా నియ‌మితం అయ్యేంత సీన్ ఉందా? కేఎల్ రాహుల్ కెప్టెన్ అయిన‌ప్పుడు పాండ్యా కావ‌డానికి ఏముంద‌నొచ్చు. అయితే కేవ‌లం రోహిత్ లేన‌ప్పుడే రాహుల్ కెప్టెన్ అయ్యాడు. అలాగే కొహ్లీ లేన‌ప్పుడు ర‌హ‌నే కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే పాండ్యా వ్య‌వ‌హారం అలా లేదు. పూర్తి స్థాయిలో ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ అని చెప్పుకుండానే హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసేశారు. ఒక ద‌శ‌లో క‌పిల్ త‌ర్వాత ఇత‌డే అనిపించినా.. పాండ్యా ఆ స్థాయిలో స‌త్తా చూపింది ఏమీ లేదు. ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్ ల‌లో కూడా పాండ్యా బౌలింగ్ లో ఎప్పుడు త‌న పూర్తి కోటాను పూర్తి చేశాడో చెప్ప‌డం అంత తేలికేమీ కాదు!

ఈ సంద‌ర్భంగా మ‌రో విష‌యాన్ని ప్ర‌స్తావించుకోవ‌చ్చు. 90ల‌లో దేవేగౌడ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భార‌త క్రికెట్ జ‌ట్టులో ఆరేడు మంది క‌ర్ణాట‌క క్రికెట‌ర్లు చోటు ద‌క్కించుకునే వాళ్లు. ఒక మ్యాచ్ లో అయితే ఏకంగా ఏడు మంది క‌ర్ణాట‌క క్రికెట‌ర్లు ఆడారు. అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, వెంక‌టేష్ ప్ర‌సాద్, రాహుల్ ద్రావిడ్ ల‌కు తోడు సునీల్ జోషీ, భ‌ర‌ద్వాజ్ .. వీళ్లంతా ఒకే మ్యాచ్ లో ఆడ‌టం అప్పుడు ఒక ఆశ్చ‌ర్యం. వీరిలో మొద‌టి న‌లుగురి పేర్ల‌పై పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండేవి కావు కానీ, ఏకంగా ఆరేడు మంది క‌ర్ణాట‌క క్రికెట‌ర్లు 11 మందిలో ఉండ‌టం మాత్రం అంతా ప్ర‌ధాని ఆదేశాల మేర‌కే అనే టాక్ ఉండేది. ఆ ద‌శ‌లోనే దొడ్డ గ‌ణేష్ క‌న్న‌డీగులు కూడా జాతీయ జ‌ట్టుకు ఆడారు. ఇప్పుడు త‌రిచి చూస్తే.. భార‌త క్రికెట్ జ‌ట్టులో గుజ‌రాతీల నంబ‌ర్ అంత‌కు త‌క్కువేమీ లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?