జగన్ అర్జెంట్‌గా దిగిపోవాల్సిన అవసరం జనానికి లేదు కానీ, పచ్చ మీడియాకి అత్యవసరం. షెడ్యూల్ ప్రకారం జరిగితే ఎన్నికలకి ఇంకా 16 నెలలు టైమ్ వుంది. ఈ లోగా జగన్ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయాలి. గత మూడు నాలుగు రోజులుగా టీవీ చానల్స్‌ను గమనిస్తే వ్యూహం మార్చుకున్నట్టు కనిపిస్తోంది. జీవో నంబర్-1తో ప్రజాస్వామ్యం మంట కలిసింది, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇందిర ఎమర్జెన్సీ పాలన కంటే అన్యాయమైంది జగన్ పాలన అంటూ చర్చలు పెట్టారు.
అసలు ఎమర్జెన్సీకి, జీవో నంబర్ 1కి సంబంధం వుందా? ఎమర్జెన్సీ నాటికి పుట్టని నాయకులు కూడా దాన్ని దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీలో ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో వేశారు. పేపర్లపై సెన్సార్ వుండింది. అదేమీ లేకనే ఎమర్జెన్సీ సమానం అంటున్నారు.
జనాల్ని చంపకుండా, మైదానాల్లో సభలు పెట్టుకోమంటే అది చాలా పెద్ద నేరం, హక్కుల ఉల్లంఘన అంటున్నారు. 11 మంది అమాయకుల మృతి గురించి ఎవరూ మాట్లాడరు. ఇక రాష్ట్రపతి పాలన విషయానికి వస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పినా, రాజకీయ అనిశ్చితి వున్నా విధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అవి లేవు. గుర్రాలతో తొక్కించి బషీర్‌బాగ్‌లో జనాల్ని కాల్చినపుడే చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పించి, రాష్ట్రపతి పాలన పెట్టాలి. అప్పుడు మాట్లాడని మీడియా ఒక జీవోని అడ్డం పెట్టుకుని మాట్లాడ్డం కరెక్టా?
జీవోని జనం పట్టించుకోకపోయే సరికి, మీడియా కొత్త రాగం ఎత్తుకుంది. వైసీపీ నాయకుల్లో భయంకరమైన అసమ్మతి, ఏ క్షణాన్నైనా బయటికి వెళ్లిపోయే వాళ్ల సంఖ్య తక్కువ కాదంటూ ప్రత్యేక కథనాలు. అసమ్మతి అన్ని పార్టీల్లో వుంటుంది. అధికార పార్టీ దానికి అతీతం కాదు. ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి సమీకరణాలు మారుతాయి. టికెట్ రాదని అనుమానం వున్న వాళ్లు ఏదో ఒక సాకుతో పార్టీ మారాలనుకుంటారు. వైసీపీలో కూడా పని చేయని నాయకుల్ని చూపించి, టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకోవడం వల్ల వెంకటగిరి సీన్స్ చాలా చోట్ల రిపీట్ అవుతాయి.
రేపు టీడీపీ పరిస్థితి ఇంకా ఘోరంగా వుంటుంది. పని చేసిన వాళ్లందర్నీ పక్కన పెట్టి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్లకి బాబు టికెట్లు ఇస్తారు. ఇది కాకుండా జనసేనతో పొత్తు జరిగితే రెబల్స్ వీధి పోరాటాలకి దిగుతారు. అసమ్మతి, నిరసన ప్రజాస్వామ్య లక్షణం. అది ప్రత్యేకంగా జగన్ పార్టీలోనే వుండదు. ఆ పార్టీ కాంగ్రెస్ పునాదుల్లోంచి వచ్చింది కాబట్టి, తగాదాలు ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు.
సహజంగా జరిగే విషయాలకి కూడా జగన్ వ్యతిరేకత అనే రంగు పూస్తే జనం తెలుసుకుంటారు. ఇవి వెనుకటి రోజులు కావు. సోషల్ మీడియా బలంగా ఉన్న కాలం. మెయిన్‌స్ట్రీమ్ మీడియాని గుడ్డిగా నమ్మే కాలం కాదు.