విశాఖ పొలిటికల్ ట్రాఫిక్ లో చిక్కుకుంటోంది. ఒకరి తరువాత ఒకరు వరసబెట్టి మరీ నాయకులు విశాఖ వచ్చేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో మూడు రోజుల పాటు సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో టూర్ చేసిన చంద్రబాబుకు మళ్లీ విశాఖ టూర్ వేయాలనిపించింది. అందుకు ఆయన ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ముహూర్తంగా ఎంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం విశాఖ బీచ్ లో రెండు కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకం అవుతారని పార్టీ చెబుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖలో వారాహీ యాత్ర పేరుతో ఉన్నారు. పవన్ ఆగస్ట్ 15న మాత్రం విశాఖలో ఉండరు, మంగళగిరిలో ఆగస్ట్ 15న జెండా వందన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ ఒక్క రోజు విశాఖలో పొలిటికల్ హీట్ తగ్గించడం ఎందుకు అన్నట్లుగా టీడీపీ ప్లాన్ చేసిందా అన్నట్లు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబు విశాఖలో పూర్తి స్థాయి పర్యటన ఈ నెల 20 తరువాత ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అపుడు విశాఖ బీచ్ లో మరోసారి వాకర్స్ తో కలసి వాక్ చేస్తారని అంటున్నారు. విశాఖలో మేధావులతో మీటింగ్ కూడా ఉంటుంది అని అంటున్నారు.
విశాఖ జిల్లాలో కూడా మరో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఈ నెల 19తో పవన్ వారాహి ముగుస్తుంది. ఆ తరువాత చంద్రబాబు టూర్ అన్న మాట. ఇలా ఇద్దరు నేతలు వరసబెట్టి విశాఖను చుట్టేస్తున్నారు. రాజకీయ వేడి పెంచేస్తున్నారు. ఇంతకీ విశాఖలో విపక్షం బలం తగ్గిందా పెరిగిందా అన్న దాని మీదనే విశ్లేషణలు చేస్తున్నారు.