విశాఖ రుషికొండ అన్నది ప్రతిపక్షాలకు చాలా అనువైన అస్త్రంగా దొరికింది. మొత్తం విశాఖనే జగన్ దోచుకువెళ్లిపోయినంత యాగీ చేస్తున్నారు. ఆ కొండ అప్పుడు, ఇప్పుడు అంటూ నానా గొడవ చేస్తున్నారు. కానీ ఇంతకీ జగన్ చేస్తున్నది ఏమిటి? రుషికొండ చుట్టూ కొంత భాగం తవ్వించి, ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. ఆవేవీ జగన్ స్వంత భవనాలు కాదు. జగన్ అధికారంలోకి దిగిపోయిన తరువాత పట్టుకెళ్లిపోయేవి కావు.
సరే రుషికొండ దగ్గరే ఎందుకు కట్టాలి? ఇంకెక్కడైనా కట్టుకోవచ్చు కదా? అన్నది ప్రతి పక్షాల ప్రశ్న.
సరే, ఎందుకు కట్టకూడదు అన్న దానికి సమాధానం వుందా?
ప్రకృతి అందాలు పాడైపోతాయి అని సమాధానం చెప్పొచ్చు.
అసలు రుషికొండ కింద నిర్మాణాలు చేపట్టడం ఇదే తొలిసారా? జగన్ మాత్రమే ఈ పని చేసారా?
రుషికొండ మొదల్లో టూరిజం కాటేజీలు కట్టించినది ఎవరు?
రుషికొండ మొదట్లో రెస్టారెంట్లు, బార్ లు పెట్టించింది ఎవరు?
అప్పుడు పది పైసల వంతో పావలా వంతో తవ్వించారు కదా? మరి అప్పుడు ఎవరూ ఏ యాగీ చేయలేదేమీ?
సరే, ఆ సంగతి అలా వుంచుదాం. విశాఖ చుట్టూ చాలా కొండలు వున్నాయి.
గాజువాక నుంచి వెంకోజీపాలెం వరకు. ఆ కొండలను జనాలు ఆక్రమించి మీద వరకు ఇళ్లు నిర్మించేసుకున్నారు. మరి అప్పుడు ఈ కొండల అందాలు పాడవలేదా? వాళ్లందరినీ వెళ్లగొట్టి ఆ కొండల అందాలు కాపాడే ప్రయత్నం పవన్ కానీ చంద్రబాబు కానీ చేయగలరా?
సరే, ఆ సంగతీ అలా వుంచుదాం. విశాఖకు రుషి కొండ కన్నా కీలకమైనది డాల్ఫిన్ నోస్. అదే డాల్ఫిన్ నోస్ మీద రక్షణ శాఖ చాలా అంటే చాలా లెక్కకు మిక్కిలి కట్టడాలు నిర్మించింది. డాల్ఫిన్ నొస్ మొత్తం ఇప్పుడు రక్షణ శాఖ అధీనంలో వుంది. ఎందుకు రక్షణ శాఖ తీసుకుంది. దేశ రక్షణ అవసరాల కోసం, విశాఖ రక్షణ కోసం కీలకమైన స్థావరంగా డాల్ఫిన్ నోస్ ను ఎంచుకుంది.
హాత్తెరీ, మా విశాఖకు తలమానికం అయిన డాల్ఫిన్ నోస్ ను తీసేసుకుని, అంతస్తుల కొద్దీ భవనాలు నిర్మిస్తారా? అని ఎవరైనా అడిగారా? అసలు అలా అడగాల్సిన అవసరం వుందా?
పోనీ ఈ సంగతి అలా వుంచుదాం.
రుషికొండ దగ్గర నిర్మిస్తున్నవి ప్రభుత్వ భవనాలు. జగన్ స్వంత భవనాలు కాదు. ఎవరికీ ఆ భూములు అప్పనంగా ఇచ్చేయలేదు.
హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో భారీ కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించారు. ఓపెనింగ్ కు సిద్దం అవుతోంది. అది ఎక్కడ కట్టారో తెలుసా? ఓ భారీ కొండను పూర్తిగా కూల్చేసి. పట్టుమని పదినెలల్లో కొండ మొత్తం లేపేసి కట్టారు. ఆ కొండను ఆ కార్పొరేట్ ఆసుపత్రికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని పవన్ కానీ చంద్రబాబు కానీ, ఆ విషయం ప్రశ్నించగలరా?
అదే విధంగా దాని పక్కనే రెండు మూడు కొండలు ప్రయివేటు బిల్డర్లకు ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారు అని బాబు లేదా పవన్ అడిగారా?
కేవలం రుషికొండ..రుషికొండ అంటూ యాగీ చేసే పవన్ సరైన జర్నలిస్ట్ కు ఓ ఇంటర్వూ ఇచ్చి, అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?
రాసే మీడియా, ప్రసారం చేసే చానెళ్లు వున్నాయి కదా అని అడ్డగోలు ప్రచారానికి పని కొచ్చే విమర్శలు చేయడం తప్ప పవన్ చేసేదేమీ లేదు.