ఖ‌బ‌డ్దార్ పెద్దిరెడ్డి!

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని తీవ్ర‌స్థాయిలో ఆయ‌న హెచ్చ‌రించారు. తాను అనుకుని వుంటే 14 ఏళ్లు జిల్లాలో తిరిగేవాడివా? అని పెద్దిరెడ్డిని…

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని తీవ్ర‌స్థాయిలో ఆయ‌న హెచ్చ‌రించారు. తాను అనుకుని వుంటే 14 ఏళ్లు జిల్లాలో తిరిగేవాడివా? అని పెద్దిరెడ్డిని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు కొంద‌రు పోలీసుల‌పై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు ఏం మాట్లాడారంటే….ఒక వ్య‌క్తి అరాచ‌క శ‌క్తిగా త‌యారై, రాష్ట్రంలో  ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడ‌న్నారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం చేస్తున్న ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. తాను ముఖ్య‌మంత్రిగా వున్న‌ప్పుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర చేశార‌ని గుర్తు చేశారు. తానెప్పుడూ అభ్యంత‌రం చెప్ప‌లేదన్నారు. పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తిగా స‌హ‌క‌రించింద‌న్నారు.

అలాగే ష‌ర్మిల పాద‌యాత్ర చేసింద‌న్నారు. మీటింగ్‌లు పెట్టింద‌న్నారు. ఆవిడ మీటింగ్‌ల‌ను ఎక్క‌డా అడ్డుకోలేద‌న్నారు. అలాగే అంత‌కు ముందు ప్ర‌భుత్వాలు కూడా అడ్డుకోలేద‌ని ప‌రోక్షంగా కిర‌ణ్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించారు. విజ‌య‌మ్మ ఎక్క‌డ చూసినా మీటింగ్‌లు పెట్టింద‌న్నారు. ఆమె మీటింగ్‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లిగించ‌లేద‌న్నారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర చేశాడ‌న్నారు. పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తిగా స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే ఆయన మొత్తం తిరిగాడ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

ఇప్పుడు త‌న‌ కోస‌మే జీవో -1 తీసుకొచ్చార‌న్నారు. తాను ఎక్క‌డా తిర‌గ‌కూడ‌డ‌నే ఆ జీవో తెచ్చార‌న్నారు. చివ‌రికి త‌న‌ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కూడా తిర‌గ‌నివ్వ‌లేద‌న్నారు. త‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో కూడా మాట్లాడొద్దంటున్నార‌ని బాబు ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ అరాచ‌కం ప‌రాకాష్ట‌కు చేరింద‌న్నారు. త‌న‌ ఇంటిపై రౌడీ ఎమ్మెల్యే దాడి చేశాడ‌న్నారు. అత‌నికి మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని బాబు తెలిపారు. ఇది పోలీసుల రాజ్య‌మా? ఉన్మాదుల రాజ్య‌మా? సైకోల రాజ్య‌మా? అని ఆవేశంతో చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి పిరికిత‌నం వ‌చ్చింద‌న్నారు. భ‌యం పుట్టుకొచ్చింద‌న్నారు. ఓట‌మి భ‌యంతో త‌ప్పుడు కేసులు పెట్టి త‌మ‌ను అడ్డుకోవాల‌ని అనుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించే వ‌ర‌కూ వ‌చ్చార‌న్నారు.

రోడ్‌షోలు ఏమైనా ఈ రాష్ట్రానికి కొత్తా? 70 ఏళ్ల నుంచి జ‌ర‌గ‌డం లేదా? నీ పాద‌యాత్ర‌లో రోడ్ షోలు పెట్ట‌లేదా? అని బాబు నిల‌దీశారు. పోలీసుల కుట్ర‌లో భాగంగానే కందుకూరులో, గుంటూరులో, ఇప్పుడు కుప్పంలో  సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. మీ ఉద్దేశం ఒక్క‌టే… నన్ను తిర‌గ‌నివ్వ‌కుండా చేయ‌డం అని జ‌గ‌న్‌పై ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్‌రెడ్డి ప‌ని అయిపోయింద‌న్నారు. ఇక ఇంటికి పోవ‌డ‌మే త‌రువాయ‌న్నారు. అందుకే పిరికిత‌నంతో చేసే పిరికిచేష్ట‌లివి అని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని  కాపాడుతారా? సైకో ప‌క్క‌న వుంటారా? సైకోకు స‌హ‌క‌రించి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? వైఎస్సార్ పార్టీలోని విజ్ఞులు ఆలోచించుకోవాల‌ని చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు.  

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి గుర్తు పెట్టుకో… ఇది బిగినింగ్ మాత్ర‌మే అని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. త‌మాషా ఆట‌లాడుతున్నావ‌న్నారు. నీ త‌డాఖా ఏంటో చూస్తా… నోరు పారేసుకుంటున్నావు. నేను రెచ్చ‌గొట్టానా? అని నిల‌దీశారు. త‌మ‌పై త‌ప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ… నువ్వొక సైకోగా త‌యార‌య్యావా? అని విరుచుకుప‌డ్డారు. అదే తాను అనుకుని వుంటే 14 ఏళ్లు నిన్ను వ‌దిలిపెట్టేవాన్నా? అని పెద్దిరెడ్డిని నిల‌దీశారు. ఈ జిల్లాలో నువ్వు తిరిగేవాడివా? గుర్తు పెట్టుకో ఖ‌బ‌డ్దార్ అని ఘాటు హెచ్చ‌రిక చేశారు.

నీ తాత జాగీరా ఇది? నీ ఇష్ట ప్ర‌కారం అరాచ‌కాలు చేస్తావా? అని పెద్దిరెడ్డిని తీవ్ర‌స్థాయిలో ప్ర‌శ్నించారు. కుప్పంలో క‌ప్పం క‌ట్టాల‌ని బెదిరిస్తావా? మెడ‌మీద క‌త్తి పెట్టి చేస్తావా, చ‌స్తావా? అని అడుగుతూ… ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల్ని చేస్తూ నువ్వొక రాజ‌కీయ నాయ‌కుడివా? అని మండిప‌డ్డారు. మీరు క‌ర‌డు గ‌ట్టిన నేరస్తుల్లా త‌యార‌య్యార‌ని విమ‌ర్శించారు.  మిమ్మ‌ల్ని వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని చంద్ర‌బాబు ఘాటు హెచ్చ‌రిక చేశారు.