రాజకీయాల్లో కూడా కొందరు నాయకులు ‘ఎంటర్‌టైనర్’లుగా ఉంటారు. తాము బాధ్యత గల రాజకీయ పదవుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు చేయగలిగిన సేవతో పాటు, వారిని నిత్యం ఎంటర్‌టైన్ చేయడమే వారి పని. వారికి అదొక ముచ్చట. వారి లక్ష్యం.
ఫరెగ్జాంపుల్ కర్నూలు రాజకీయాల్లో పరిచితమైన బంగి అనంతయ్య, తిరుపతి ఎంపీగా కూడా చేసిన సినీ నటుడు ఎన్.శివప్రసాద్ లాంటివాళ్లు. సందర్భాలను బట్టి రకరకాల వేషధారణలు ధరిస్తూ.. రకరకాల రూపాల్లో తిరుగుతూ.. వారు ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తుండేవారు. వారు మరణించిన తర్వాత అలాంటి ఎంటర్‌టైనర్లు లేకుండాపోయారు. నిజానికి వారు అందించిన ఎంటర్‌టైన్మెంటు ఒకస్థాయి ప్రజలకే ఎక్కుతుంది. కాస్త సీరియస్, ఆలోచన పరులైన ప్రజలకు వారిచ్చే వినోదం ఎక్కదు. అలాంటి వారికి మంచి ఎంటర్‌టైనర్ చంద్రబాబునాయుడు.
హైదరాబాదు నగరాన్ని నేనే నిర్మించా.. బిల్ గేట్స్ కు నేనే కంప్యూటరు నేర్పించా, బిల్ క్లింటన్ గెలిచేలా నేనే చేశా, అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది నేనే, హైదరాబాదుకు కంప్యూటర్ల రుచి చూపించింది నేనే.. అంటూ ఆయన చాలా తరచుగా చెప్పుకుంటూ ఉండే మాటలు విని.. సీరియస్ ప్రజలు కూడా ఎంటర్ టైన్ అవుతుంటారు. అటువంటి చంద్రబాబునాయుడు తాజాగా మరొక జోకు పేల్చారు. ఇది అట్టాంటిట్టాంటి జోకు కాదు. జోక్ ఆఫ్ ది సెంచరీగా పరిగణింపదగినట్టిది. అక్షరలక్షలు చేసేటువంటి జోకు అన్నమాట. ఇంతకూ అదేంటో తెలుసా..
తెలుగుదేశం పార్టీ ఏపీలో చాలా బలంగా ఉన్నదిట. ఎంత బలంగా ఉన్నదయ్యా అంటే.. వారు గేట్లు తెరవకుండా చాలా నిగ్రహం పాటిస్తున్నారట. గేట్లు తెరిస్తే.. తెదేపాలో వైకాపా విలీనం అయిపోతుందిట. ఆ రేంజిలో వైసీపీ నాయకులు వెల్లువలా వచ్చి తెలుగుదేశంలో చేరిపోతారట.
ఈ మాటలు కల్పన కాదు. సాక్షాత్తూ ఢిల్లీలో జాతీయ మీడియాతో జరిగిన ఇష్టాగోష్టి భేటీలో చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఇవి. ఢిల్లీలో కూర్చుని.. నడ్డా చెవిలో నోరుపెట్టి రెండు ఫోటోలు దిగి వాటిని తెలుగు మీడియాకు లీక్ చేయడం ద్వారా.. ‘పొత్తులు కుదిరిపోతున్నాయోచ్’ అని సంకేతాలు పంపడానికి ఉబలాటపడిన చంద్రబాబునాయుడు.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల గురించి మరిన్ని మాటలు వల్లించాలని అనుకున్నారు.
బిజెపితో తమకు ఎన్నడూ వైరం లేదని, అవసరాన్ని బట్టి పొత్తులుంటాయని సన్నాయి నొక్కులు నొక్కారు. ఏపీలో సాద్యమైనంత ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా అన్నారు. చాలా నియోజకవర్గాల్లో మీకు పార్టీకి ఇన్చార్జిలే లేరంట కదా అనే ప్రశ్న రావడంతో.. చంద్రబాబు తన ఎంటర్‌టైన్‌మెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. ‘ఆ మాట కరెక్టు కాదు. ప్రతి నియోజకవర్గంలో టికెట్ల కోసం అభ్యర్థులు క్యూలో ఉన్నారు. మేం గేట్లు తెరిస్తే తెదేపాలో వైకాపా విలీనం అయిపోతుంది’ అని సెలవిచ్చారు. ఈ మాటలు విన్న మీడియా ప్రతినిధులెవ్వరికీ తర్వాతి ప్రశ్న అడగడానికి నోరు పెగల్లేదంటే నిజం.
ఢిల్లీ లెవెల్లో ఉండే విలేకర్లు కూడా చాలా మంది నాయకుల ప్రగల్భాలు చూస్తూ వింటూ జోక్ ఆఫ్ వీక్, మంత్, ఇయర్ అని అనుకుంటూ ఉంటారు గానీ.. చంద్రబాబునాయుడు మాత్రం.. వారికి జోక్ ఆఫ్ ది సెంచురీని రుచి చూపించారని అంతా అనుకుంటున్నారు.