తె-బీజేపీ: అసమర్ధతకు అందమైన ముసుగు!

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశం లేదు. ఎందుకంటే వారికి తగినంత బలం లేదు. కానీ, ఆ పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి తమ అసమర్ధతకు ఒక అందమైన…

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశం లేదు. ఎందుకంటే వారికి తగినంత బలం లేదు. కానీ, ఆ పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి తమ అసమర్ధతకు ఒక అందమైన ముసుగు తొడుగుతున్నారు. మూడు నెలలు ముందుగా అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం లేదని, కెసిఆర్ అలా ప్రకటించడం ద్వారా అభ్యర్థులను ఒక ఉచ్చులో బిగించారని ఆయన వివరిస్తున్నారు. కిషన్ రెడ్డి మాటల తీరును గమనించిన ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు.

మరో మూడు నెలల దూరంలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితి అందరికంటే ముందుగా ఒకే జాబితాగా తమ అభ్యర్థులను ప్రకటించింది. నాలుగు స్థానాలు మిగతా 115 మంది పేర్లను వెల్లడించింది. భారాసను మట్టి కరిపించి అధికారంలోకి వస్తామని ఆశిస్తున్న కాంగ్రెస్, అభ్యర్థుల వడపోత ప్రక్రియను ప్రారంభించింది. 

రెండు మూడు వారాలలోగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కూడా రావచ్చుననే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ కు ప్రత్యామ్నాయం మేమే అని చాటుకుంటున్న బిజెపిలో మాత్రం ఇంకా అభ్యర్థుల గురించిన చప్పుడే లేదు. ఈ ఆలస్యానికి వారు చెప్పుకుంటున్న కారణాలే చిత్రంగా ఉన్నాయి.

మూడు నెలల ముందు ప్రకటించడం వృథా అట! ఎందుకంటే పేర్లు ప్రకటించేస్తే ముఖ్య నేతలంతా (ఆ పార్టీలో ఓ 30 మంది ఉన్నారట) వారంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమైపోతే మిగిలిన ప్రాంతాల్లో పార్టీ వెనుకబడుతుందిట. అలాగే, ఇప్పటి నుంచి ప్రచారంలోకి వెళ్లాలంటే అభ్యర్థులకు ఆర్థిక భారం కూడా పెరిగిపోతుందిట. అందువల్ల అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని భాజపా ఇంకా అభ్యర్థుల గురించిన కసరత్తును ప్రారంభించలేదట. .. ఈరీతిగా నమ్మేవాళ్లుంటే ఏమైనా చెప్పగలం అన్నట్టుగా కమలనాయకులు తమ చేతగానితనానికి ముసుగులు తొడుగుతున్నారు.

నిజానికి అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతోంటే.. రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తమ తొలివిడత అభ్యర్థులను ఎన్నడో ప్రకటించేసింది. భారాస జాబితాకంటె వారాల ముందు బిజెపి ఇతర రాష్ట్రాల జాబితాలు వచ్చాయి. అభ్యర్థుల ఖర్చు, భారం లాంటి పడికట్టు పదాలు ఇక్కడ వాడుతున్నారు తప్ప.. ఆ ప్రాంతాల్లో ఎందుకు ముందే జాబితాలు వచ్చినట్టు! 

నిజం చెప్పాలంటే బిజెపికి 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే కోరిక పుష్కలంగా ఉంది. అయితే వారికి అభ్యర్థులు లేరు. ఆ విషయం బయటపడకుండా మేనేజి చేయాలనే ఆశ. భారాస లిస్టులు తేలిపోయాయి. 

అసంతృప్తులంతా కాంగ్రెసు వైపు వెళుతున్నారు. అక్కడి లిస్టులు కూడా నేడో రేపో తేలిపోతాయి. అక్కడ టికెట్లు దొరక్క ఠికానా లేని వాళ్లంతా మిగిలిపోతారు. అప్పుడైనా వాళ్లు తమ పార్టీలోకి వస్తారేమో వారిని అభ్యర్థులుగా ప్రకటిద్దాం అని బిజెపి ఎదురుచూస్తోంది. ఈ అంశాన్ని కవరింగు చేసుకోవడానికి పాపం కమలనాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు.