బాబుకు నిజంగా భాజపా పొత్తు కావాలా?

2019లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చంద్రబాబు భాజపా పొత్తు కోసం తహ తహ లాడుతూనే వున్నారు. అవకాశం వచ్చినపుడల్లా ఆ తహ తహ కనబరుస్తూనే వున్నారు. అందులో అస్సలు సిగ్గుపడడం లేదు. మొహమాట…

2019లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చంద్రబాబు భాజపా పొత్తు కోసం తహ తహ లాడుతూనే వున్నారు. అవకాశం వచ్చినపుడల్లా ఆ తహ తహ కనబరుస్తూనే వున్నారు. అందులో అస్సలు సిగ్గుపడడం లేదు. మొహమాట పడడం లేదు. 2019లో తాను భాజపాకు దూరం కాకపోయి వుంటే అధికారం చేజారిపోయేది కాదు అని చంద్రబాబు బలంగా నమ్మడమే అందుకు కారణం కావచ్చు. 

గమ్మత్తేమిటంటే అదే 2019లో జనసేనకు కూడా దూరం జరిగారు. అయితే ఇది మాత్రం పక్కా ఎన్నికల డ్రామా అని అప్పట్లోనే కాదు, ఇప్పటికీ జనం భావిస్తున్నారు. అదే నిజం అనడానికి సింపుల్ లాజిక్ వుంది. 2019లో దూరమైన భాజపాకు ఇప్పటికీ దగ్గర కాలేకపోతున్నారు. ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కానీ 2019లో దూరమైన జనసేన కు మాత్రం చాలా సులువుగా, వెంటనే దగ్గరైపోయారు. అదెలా అంటే.. అదంతే అనుకోవాల్సిందే. 

2020లో జనసేన ఉన్నట్లుండి భాజపా దగ్గరకు వెళ్లినపుడే అందరికీ అర్థం అయింది. చంద్రబాబు తన పొత్తు పాచికలు కదపడం ప్రారంభించారని. పాచిపోయిన లడ్లు అంటూ భాజపాను గట్టిగా దుయ్యబట్టిన పవన్ ఆ సంగతి చాలా కన్వీనియెంట్ గా మరిచిపోయారు. లోకేష్ అవినీతిని, అమరావతిని ఓ వర్గపు రాజధాని అన్న విషయాన్ని వదిలేసి తెలుగుదేశం వైపు వెళ్లిపోయారు. దానికి పవన్ పెట్టుకున్న పేరు, ఓట్లు చీలకుండా చూడడం. 

పవన్ ను రాయబారిగా వాడి భాజపాకు దగ్గర కావాలన్నది చంద్రబాబు ఆలోచన అని రాజకీయాల్లో ఓ..న..మ లు తెలిసిన వారిని అడిగినా చెబుతారు. సుజనా, రమేష్ ఇలాంటి వారిని భాజపాలోకి పంపింది కూడా బాబేనని, దాని మోటో.. కూడా ఇదే అని చెబుతారు. భాజపాలోకి వెళ్లినా వాళ్లు బాబు కోసమే పని చేస్తారని, నిన్నటికి నిన్న ఎన్టీఆర్ నాణెం విడుదల టైమ్ లో ‘ప్రత్యేకంగా’ తీసిన ‘ఫొటో’ ఉదంతం కూడా వెల్లడిచేసింది.

సో…2024లో గెలవాలంటే 2019లో దూరం చేసుకున్న భాజపా.. జనసేనలను దగ్గర చేసుకోవాల్సిందే అన్నది బాబుగారి ఫార్ములా అని క్లారిటీ వచ్చేసింది. కానీ ఒకటే అనుమానం. 

జనసేనను దగ్గర చేసుకుంటున్నారంటే అర్థం వుంది. జనసేన వెనుక ఓ బలమైన సామాజిక వర్గం వుంది. ఆ వర్గం ఓట్లు కావాలి. ఆ వర్గం ఓట్లు చీలిపోకూడదు. అలా అయితేనే తాము గెలుస్తాం..అధికారంలోకి వస్తాం అన్నది బాబు ఆలోచన. అది సరైనదే అనుకుందాం. 

కానీ భాజపాకు ఆంధ్రలో వున్న బలమెంత? ఓట్ల శాతం ఎంత? కార్యక్తర్తలు ఏరీ? నాయకులు ఏరీ? అయినా కూడా భాజపా పొత్తు కోసం అంత బేలగా, అంతలా కిందకు దిగిపోయి మరీ చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. భాజపా పొత్తు వున్నా, లేకున్నా ఆంధ్రలో బాబు పార్టీకి వచ్చే లేదా పోయే ఓట్లు ఏమీ లేవు. పైగా అసలు హోదా ఇవ్వనందుకు, రైల్వే జోన్ ఏర్పాటుచేయనందుకు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నందుకు భాజపా మీద ఆంధ్ర జనాలకు కోపం వుంది. ఈ రోజు దేశంలో రేట్లు అంతలా పెరిగిపోవడానికి కారణం భాజపా ప్రభుత్వ విధానాలనే క్లారిటీ వుంది.

కానీ భాజపాతో పొత్తు అనేది తమ భవిష్యత్ వ్యూహం కనుక తెలుగుదేశం పార్టీ జోన్, హోదా, స్టీల్ ప్లాంట్, ధరల పెంపు ఇలాంటి తప్పిదాలు అన్నీ తీసుకువచ్చి జగన్ పార్టీ మీద పోస్తోంది. జగన్ చేతకాని తనం వల్లే హోదా, జోన్ రాలేదు. లేదూ అంటే భాజపా ఎప్పుడో ఇచ్చేసేది. జగన్ ఆపకనే స్టీల్ ప్లాంట్ అమ్మకం సాధ్యం కాలేదు.. అన్ని రేట్లు పెంచేసింది జగన్ నే అని టముకు వేస్తూ వస్తోంది.

సరే, భాజపా తప్పిదాలు అన్నీ వైకాపా ఖాతాలో వేసి, జనాల్ని నమ్మబలుకుతారు అనుకుందాం. ఎందుకంటే తాము అనుకున్న దిశగా ప్రచారం సాగించి, ఎదుటవారి మీద బురద వేయడంలో తెదేపా, దాని అను.. కుల.. మీడియా.. ఆరితేరిపోయాయి కనుక. జనాలు భాజపా మీద ఆగ్రహం తగ్గించేసుకుంటారు అనుకుందాం. అలా అయినా కూడా భాజపా ఓట్ల శాతం ఎంత? ఆ పార్టీతో పొత్తు వల్ల తేదేపాకు వచ్చే అదనపు ఓట్ల బలం ఎంత? అలా లెక్కలు కడితే అస్సలు ఉపయోగం కనిపించదు.

మరెందుకు, భాజపా పొత్తు కోసం తేదేపా తహ తహలాడుతోంది. ఓట్లకు మించిన ఉపయోగం ఏదైనా వుందా? అన్నదే అసలు కీలకం. ఎన్నికలు జరిగే తీరు, ఎన్నికల టైమ్ లో జరిగే వ్యవహారాలు, ఎన్నికల టైమ్ లో పన్నే వ్యూహాలకు మద్దతు కోసమే భాజపా అవసరం తేదేపాకు కనిపిస్తోంది. అంతకు తప్ప మోడీ మీద అస్సలు ప్రేమ లేదు. అది పచ్చి వాస్తవం.

ఆంధ్రలో తేదేపా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయిన ఓ వర్గం బలంగా కోరుకుంటోంది. ఆ వర్గానికి పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీలో వున్నా కూడా ఆంధ్రలో తేదేపాకే అధికారం రావాలని బలంగా కోరుకుంటోంది. కానీ అదే వర్గం ఈ సారి కేంద్రంలో మోడీ రాకూడదు, రాహుల్ గాంధీ రావాలని కూడా కోరుకుంటోంది. సదరు వర్గం సోషల్ మీడియా ఖాతాలను రెగ్యులర్ గా ఫాలో అయితే, ఆ వర్గం మోడీని కోరుకుంటోందా? రాహుల్ ను కోరుకుంటోందా? అన్నది అర్థం అవుతుంది. మరి మోడీ రాకూడదని కోరుకుంటున్న వర్గం, బాబును రావాలని బలంగా కోరుకుంటున్న వర్గం ఒకటే ఎలా అవుతాయి? 

అంటే బాబు రావాలి. కానీ మోడీ రాకూడదు. మోడీ ఎందుకు రాకూడదు అంటే బాబు ఆటలు సాగవు అనే అనుమానం కనుక. కానీ బాబు రావాలి అంటే మోడీ సపోర్ట్ కావాలి. ఇదో చిత్రమైన ఎన్నికల ఈక్వేషన్. 

ఇంతకీ మోడీ మద్దతు ఎందుకు అంటే.. ఎన్నికల మేనేజ్ మెంట్‌కు. గతంలో బాబు అధికారంలో వుండగా ఎన్నికలు జరిగితేనే జగన్ పోల్ మేనేజ్ మెంట్‌ను అడ్డుకోలేకపోయారు. ఎందుకు అంటే మోడీ అండ వుడడం వల్లనే అని ఓ భావన. ఎన్నికలు అంటే అక్రమాలు. ఎన్నికలు అంటే డబ్బు పంపిణీ, ఎన్నికలు అంటే ఇంకా.. ఇంకా… ఇప్పుడు జగన్ అధికారంలో వున్నారు. దానికి మోడీ అండ కూడా తోడయితే ఎన్నికల్లో తేదేపా ఆటల సాగవు అనే భయం భయంకరంగా వెంటాడుతోంది. అందుకే భాజపా అండ కావాలి.

కానీ మళ్లీ అక్కడే మరో సమస్య వుంది. మోడీ తో నేరుగా పొత్తు పెట్టుకుంటే.. మైనారిటీ ఓట్లు పూర్తిగా దూరం అయిపోతాయి. ఇప్పటికే మైనారిటీ ఓట్లు వైకాపాకు అనుకూలంగా వున్నాయి అనే భావన వుంది. మోడీతో అఫీషియల్ పొత్తు పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. అందువల్ల పైకి భాజపాతో పొత్తు కు రెడీ అనే సిగ్నల్స్ ఇస్తున్నా.. అది వేరే కథగా వుంటుంది.

అంటే పొత్తు వుండాలి.. వున్నట్లు కనిపించకూడదు. మద్దతు వుండాలి.. దన్ను వుండాలి తప్ప, భాజపా తప్పిదాలు తమ మీద పడకూడదు. ఇదీ తేదేపా స్ట్రాటజీ. కానీ ఎవరైనా ఒకసారి మోసపోతారు. రెండుసార్లు మోసపోతారు. కానీ బాబు వైఖరి తెలిసిన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల దగ్గరకు రానివ్వకుండా చేసాయి. భాజపా ది కూడా అదే దారి. అయినా బాబు గారు భాజపా చూరు పట్టుకుని వేలాడుతూనే వుంటారు. 

అంతా బాగానే వుంది.. చిన్న అనుమానం మిగిలే వుంది.

హోదా ఇవ్వకపోవడం వల్లనే భాజపాకు దూరం అయ్యాను.. అంతే తప్ప వాళ్లతో శతృత్వం ఏమీ లేదు అంటున్నారు బాబు గారు…

మరి ఇప్పుడు ఎలా కలవాలనుకుంటున్నారు..హొదా ఇస్తామని ఏమన్నా అన్నారా? లేక ఇస్తే కలుస్తారా? లేక కలిస్తే ఇస్తారా?

ఇవన్నీ జనాలకు అర్థం కావనుకుంటున్నారా? తెలియదుకుంటున్నారా?

మన అను.. కుల.. మీడియా రాయనంత మాత్రాన జనాలకు చేరాల్సినవి చేరుతూనే వుంటాయి.