అధినేత మనసు చూరగొనడం ఎలా? అనే ప్రశ్నకు సమాధానం … తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయ పంథానే. తెలుగు సమాజం అంతా సంక్రాంతి పండుగ మూడ్‌లో వుంది. ఈ సందర్భంగా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి మెప్పు పొందేలా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంబరాలు చేపట్టారు.
మొదటగా భారీ మొత్తం వెచ్చించి జగన్ సొంత పత్రిక సాక్షికి తనతో పాటు పెద్ద కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరుతో భారీ వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనల్లో జగన్, భారతిలను ఉద్దేశించి …”పల్లె భారతికి ప్రతినిధిగా, నమ్మిన వారి ఇలవేల్పుగా, బడుగుల గుండె చప్పుడుగా, సంక్రాంతి వేళ పెద్ద కొడుకుగా వస్తున్నాడు…నేల తల్లికి వాన చేరితే సత్యం, శివం,న సుందరం, జగనన్న అడుగులో భారతమ్మ అడుగు వేస్తే సంక్రాంతి సంబరం” వావ్, ఈ మాటలకు జగన్ దంపతులు ఫిదా కాకుండా ఎలా ఉండగలరు?
ఇంతటితే చెవిరెడ్డి ఊరుకోలేదు. వైఎస్ జగన్ ఇంట ఇవాళ సంక్రాంతి సంబరాలు జరపడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడలేదు. గత ఏడాది కూడా చెవిరెడ్డి నేతృత్వంలో జగన్ ఇంట సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆ పరంపరను చెవిరెడ్డి కొనసాగిస్తుండడం విశేషం. జగన్ ఇంటి పరిసరాలను పల్లె ప్రతిబింబించేలా చెవిరెడ్డి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. నవరత్నాల పథకాలను పండుగకు ముడిపెట్టి చక్కగా కనువిందు చేయనున్నారు.
కళాకారులు ప్రకృతిరెడ్డి, హారిక నారాయణ్, కనకవ్వ తదితర ప్రముఖులను ఆహ్వానించి జగన్ ఇంట సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా చేయడానికి చెవిరెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ దంపతుల ఆదరణను చూరగొనడానికి చెవిరెడ్డి ఇంతకంటే ఏం చేయాలి. రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి చెవిరెడ్డి ఆదర్శం. ఆయన రాజకీయ పంథా…భావి రాజకీయ ఔత్సాహికులకు ఓ రోల్ మోడల్. చెవిరెడ్డి… నువ్వు తోపు గురూ!