మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రగిలిపోతున్నారు. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు. ఇద్దరూ ఎస్వీయూనివర్సిటీ నుంచి రాజకీయాలు మొదలు పెట్టారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలైనప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. చంద్రబాబునాయుడికి అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దిరెడ్డి మాత్రం మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో భోగి పండగ నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భోగి మంటల్లో జీవో నంబర్-1 ప్రతుల్ని కాల్చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంతో పాటు ప్రత్యేకంగా పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు ఏమన్నారంటే…
“పండగ పూట మా కార్యకర్తల్ని జైల్లో పెట్టావు. భవిష్యత్‌లో నువ్వు ఎక్కడ వుంటావో ఊహించుకో. ఈ భూమిపై ఎక్కడున్నా తీసుకొస్తా. నిన్ను వదలను. ఇంత వరకూ నా సున్నితత్వాన్నే చూశారు. ఇకపై నాలోని కఠినాన్ని చూస్తారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటాం” అని బాబు తన మార్క్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇంత కాలం అధికారంలో ఎవరున్నా పెద్దిరెడ్డి, చంద్రబాబు తమతమ వ్యాపారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించేవాళ్లు.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంపై జగన్ కన్నేయడం, అందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో తన ఉనికికి ప్రమాదం తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారనే ఆగ్రహం చంద్రబాబులో బలంగా వుంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఎలా వ్యవహరించినా కుప్పంలో అరాచకాలకు పెద్దిరెడ్డే ప్రధాన కారణమని చంద్రబాబు భావన. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి భయకంపితులను చేసి, టీడీపీ పని అయిపోయిందనే సంకేతాల్ని పంపడంలో పెద్దిరెడ్డిది కీలక పాత్ర అని చంద్రబాబు ప్రతీకారంతో రగిలిపోతున్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని తన గ్రామం నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబు అదే పనిగా పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం టార్గెట్ వైసీపీ జాబితాలో పెద్దిరెడ్డిది ఫస్ట్ ప్లేస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఆగ్రహంతో కూడిన మాటల్ని వింటే… అన్నంత పని చేసేలా ఉన్నాడని వైసీపీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఏపీలో ప్రతీకార రాజకీయాలు రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఇలాంటివి ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అనే చర్చ జరుగుతోంది.