ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వం వహిస్తున్న వైఎస్సార్‌సీపీ 2024లో మరోసారి అధికారంలోకి వస్తుందా? అంటే…జనసేనాని పవన్‌కల్యాణ్ “భయం” ఔననే సమాధానం ఇస్తోంది.
ఎందుకనో ఆయన వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందేమోనని తెగ ఆందోళన చెందుతున్నారు. తన పార్టీ అధికారంలోకి రాదేమోనన్న ఆందోళన కంటే, తాను ద్వేషించే జగన్ మళ్లీ సీఎం అవుతారేమోనని ఆయన భయపడుతున్నారు. ఇదో విచిత్ర పరిస్థితి.
తాను ముఖ్యమంత్రి అయి మంచి పరిపాలన అందించాలన్న ధ్యాస పవన్ కల్యాణ్‌లో కొరవడింది. ఎంతసేపూ జగన్ నామస్మరణ చేస్తూ, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మూడో విడత జనసేన జనవాణి కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనం నుంచి పవన్‌కల్యాణ్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన భయాన్ని బయటపెట్టుకున్నారు.
వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ అధోగతిపాలవుతుందన్నారు. రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పాలసీ గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారన్నారు.
అన్న వస్తే అద్భుతాలు చేస్తాడని నమ్మించారన్నారు. పాలన పూర్తి కావస్తున్నా ఏం అద్భుతాలు చేశారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందేమో అన్న అనుమానం పవన్‌ను ఎందుకు వేధిస్తున్నదో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు.
ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వం మరో రెండేళ్లలో గద్దె దిగుతుందనే భరోసా పవన్ కల్పించలేకపోతున్నారు. అసలు ఆ మాటే ఆయన నుంచి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో, జగన్ సీఎం అవుతారేమో అని తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు ఆయన మాటలు విన్న వారెవరికైనా అర్థమవుతుంది.
అంటే తాను చేస్తున్న విమర్శలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి తేడా ఉందని ఆయన నమ్ముతున్నారా? మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని ఆయన ఏ రకంగా నిర్ధారణకు వస్తున్నారు? ఆ నమ్మకం, భయం లేకపోతే ఎందుకని ఆయన పదేపదే జగన్ అధికార నామస్మరణ చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.