తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సొంత నియోజకవర్గ దిక్కులేదు. కానీ ప్రత్యర్థులపై నిత్యం నోరు పారేసుకుంటుంటారు. ప్రత్యర్థులతో అనరాని మాటలు అనిపించుకోవడం ఆమెకు ఇష్టంలా వుంది.
టీడీపీలో ఎదగాలంటే ఇలాగే మాట్లాడాలి అనే నిబంధన ఏదో పెట్టుకుని, అందుకు తగ్గట్టు నడుచుకుంటున్నారనే విమర్శలు ఆమెపై వున్నాయి. తనపై బాడీ షేమింగ్, వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఎల్లో మీడియాధిపతి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్య పదజాల ప్రయోగాన్ని, వ్యక్తిగత అంశాల్ని తెరపైకి తెస్తూ తిట్టడాన్ని నాగరిక సమాజం హర్షించదు.
అయితే తమ పట్ల ప్రత్యర్థులు మర్యాదగా వుండాలని ఎలా కోరుకుంటారో, అదే రీతిలో తాము వ్యవహరించాలని ఎవరైనా గుర్తించాలి. ప్రత్యర్థుల దూషణలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న అనిత, తాను మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిపై అవాకులు చెవాకులు పేలడాన్ని సమర్థించుకుంటారా? మనిషి అందంగా వుంటే సరిపోతుందా? మనసు, మాట అందంగా వుండాల్సిన పనిలేదని అనిత భావిస్తున్నారా? అనే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు?
అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటామని అనిత హెచ్చరించడం గమనార్హం. ఈ సందర్భంగా తమ ఫస్ట్, సెకెండ్ టార్గెట్స్ ఎవరో కూడా ఆమె చెప్పారు. ఇందుకు తన పార్టీ అనుకూల చానల్‌ను వేదిక చేసుకున్నారు. ప్రభుత్వం అంటూ వస్తే మీ తొలి టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నకు కొడాలి నాని, ఆ తర్వాత విజయసాయిరెడ్డి అని ఆమె చెప్పారు. అది కూడా నిబంధనల ప్రకారమే పని పడతామని హెచ్చరించారు. ఓకే చెప్పడం వరకు అంతా బాగుంది. ఎవరికి చేతనైతే వాళ్లు చూసుకుంటారు.
అసలు విషయానికి వచ్చే సరికి… టీడీపీలో అనిత స్థాయి ఏంటో తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేటేనా? అనే ప్రశ్నకు అక్కడే అని ఆమె సమాధానం ఇచ్చారు. అంతటితో ఆన్సర్ ఆగిపోలేదు. ఎక్కడకైనా పంపాలనుకుంటే ఆరు నెలల ముందే పంపాలని సర్‌కు చెప్పానన్నారు. కనీసం తనకు పాయకరావుపేటలో టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియని, నమ్మకం లేని అనిత టార్గెట్ల వరకూ వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట అనే సామెత చందాన, అనిత బడాయి మాటలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ పెద్ద నాయకులపై నోరు పారేసుకోవడం, ఆ తర్వాత తాను తిట్టించుకోవడం అనితకు అలవాటైంది. ఇలాంటి వాటితో టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవచ్చేమోగానీ, ప్రజల మనసులను చూరగొనలేననే వాస్తవాన్ని అనిత గుర్తించాలి. ముందు పాయకరావుపేటో లేక మరెక్కడైనా కుదురుకోవడంపై అనిత దృష్టి సారించాలి. ఇదే రీతిలో రాజకీయ పంథా కొనసాగిస్తే మాత్రం… త్వరగానే భ్రష్టు పట్టడం ఖాయం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా, ముందే మేల్కొని, పగటి కలలు మాని, వాస్తవంలో జీవిస్తే ఆమెకే మంచిది.