ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోకేశారు. కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వాళ్లతో యుద్ధం, పోరాటం చేస్తున్నా అని జగన్ అంటే ఎలా వుంటుంది? కామెడీ అనిపించదా? అనిపించకుండా ఎలా వుంటుందనే సమాధానం వస్తుంది. ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో వరుసగా రెండోరోజు ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో ఆయన వరద బాధితులను పరామర్శించారు. జగన్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే పోలవరంలో నీళ్లు నింపుతామని హామీ ఇచ్చారు. పోలవరం ముంపు బాధితుల విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోతే ఆ భారాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సెప్టెంబర్ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామన్నారు.
ఇప్పటికే నిర్వాసితులకు పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటే మరో రూ.20 వేల కోట్లు అవసరం వుంటుందన్నారు. ఈ సొమ్ము రాబట్టుకోడానికి కేంద్రంతో కుస్తీ పడుతున్నామన్నారు. ఇప్పటికే రూ.2900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సి వుందన్నారు. వాళ్ల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయ్యా మేము ఇచ్చాం సామి, మీరివ్వాలని అడుగుతున్నామన్నారు.
పోలవరం ఆర్అండ్ఆర్ నిధుల కోసం కేంద్రంతో యుద్ధం, పోరాటం చేస్తున్నామని జగన్ చెప్పు కొచ్చారు. నిధుల కోసం కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నామన్నారు. కేంద్రాన్ని బతిమలాడుతూ వున్నట్టు జగన్ చెప్పారు. కేంద్రంతో ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం అనే మాటే వదిలేసిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా ప్రశ్నించే పరిస్థితి మన పార్టీలకు లేదు. అందుకే కేంద్రంతో యుద్ధం, పోరాటం లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడితే జోక్ చేసినట్టుగా ప్రజానీకం భావిస్తుంది.