మునుగోడులో గెలిస్తే అధికారం వస్తుందా ..?

తెలంగాణా బీజేపీ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలని కోరుకుంటోంది. కొంతకాలం కిందట హుజూరాబాద్ ను గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు మునుగోడును గెలుచుకోవాలని, దాన్ని గెలుచుకుంటే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో…

తెలంగాణా బీజేపీ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలని కోరుకుంటోంది. కొంతకాలం కిందట హుజూరాబాద్ ను గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు మునుగోడును గెలుచుకోవాలని, దాన్ని గెలుచుకుంటే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవచ్చని బీజేపీ ప్లాన్. 

కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులవరకూ ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ప్రచారం చేసుకుంటున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ స్థానాలు సాధించడంతో రాష్ట్రంలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉబలాటంగా ఉన్నారు.

వారి తాపత్రయం మరింత పెరగడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దోహదం చేస్తున్నాడు. ఉత్తమకుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి బీజేపీ పాట పాడుతున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తన వేగాన్ని పెంచాడు. ఇందుకు కారణం రేవంత్ రెడ్డి అంటే పడకపోవడమే. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలనుకున్న తరువాత ఇక ఆ పార్టీ నాయకులు ఎందుకు వదులుతారు? 

వాస్తవానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీజేపీలో చేరాలని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే చాలని రాజగోపాల్ రెడ్డి అనుకున్నాడట. కానీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తీరాలని, అలా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి దాంట్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచి సత్తా చాటితే కేసీఆర్ కు భయం పుడుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు అంటున్నారట. 

బీజేపీలో చేరాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న తరుణంలో మునుగోడుకు ఉపఎన్నిక జరిగితే అది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 2023లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవడానికి మరింత స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లేందుకు బీజేపీ డైరెక్షన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ఉపఎన్నిక ఏర్పడితే గతంలో హుజురాబాద్ విషయంలో అనుసరించినట్లుగానే మునుగోడులోనూ బీజేపీ పకడ్బందీ వ్యూహాలను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ టాప్ లీడర్స్‌ను మునుగోడులో ప్రచారానికి దింపే అవకాశం ఉండకపోదు. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి దూకుడుకు గట్టి బ్రేక్ వేసేలా ఉందనే చెప్పాలి.

ఇతర పార్టీల నేతల చేరికలతో ఇటీవల పార్టీకి ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కొరకరాని కొయ్యలా మారింది. పార్టీపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నా ఇప్పటివరకూ కనీసం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయలేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాయబారం కూడా వర్కౌట్ కాకపోవడం.. పార్టీ మారడం చారిత్రక అవసరమని రాజగోపాల్ రెడ్డి చెప్పడం.. ఇక తాను పార్టీ మారడం పక్కా అని ఆయన సంకేతాలిచ్చినట్లుగానే కనిపిస్తోంది. 

ఇప్పటికైతే బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గానీ, బీజేపీ వర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అంతర్గతంగా ఇరువురి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది. 

ఆగస్టు నెలలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ మారినా నియోజకవర్గంలో పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొందరు రాజకీయ విశ్లేషకులు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేసినట్లయితే గెలవడం కష్టమంటున్నారు. 

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల‌రెడ్డి ప్రాథ‌మికంగా నిలకడ లేని మనిషి. నిన్న మొన్నటివరకు తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని రాజగోపాల‌రెడ్డి కాంక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనట్టు నిర్ధారణకు వచ్చినప్పుడు ఇక వెంకటరెడ్డి సీఎం కాలేరు, రేవంత్ రెడ్డి కూడా సీఎం కాలేరు. అందువల్ల తన రాజకీయ భవిష్యత్తును బీజేపీలోనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నట్టు అర్ధమవుతున్నది.

టీఆర్ఎస్ నాయకులు కొందరు అంటున్నట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి రాజకీయేతర వ్యవహారాలు ఎక్కువ. తన వ్యాపార ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారమూ ఉంది. గత మూడేళ్ళుగా తన నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భాలు తక్కువ. అలాగే మునుగోడులోని మున్సిపల్ చైర్మన్‌, జడ్పిటీసిలు, పలువురు సర్పంచ్ లు, ఇతర గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. 

బీజేపీకి మునుగోడులో నెట్ వర్క్ లేదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఆయనకు స్థానికంగా ఉండే సైనిక బలగాలు ఏవి? ఈటల రాజేందర్ వేరు, రాజగోపాలరెడ్డి వేరు. హుజురాబాద్ వేరు, మునుగోడు వేరు. కేవలం ధనబలం ఒక్కటే గెలిపించదు.

వ్యక్తిగత ఇమేజ్, జనాకర్షణ, కార్యకర్తల బలం, ప్రజల్లో అభిమానం లేదా సానుభూతి, పోలింగు బూత్ స్థాయి మేనేజ్ మెంటు సత్తా, వంటి అనేక హంగులు కావాలి. తెలంగాణ ఉద్యమంలో పోషించిన క్రియాశీలక భూమిక, కేసీఆర్ అన్యాయం చేశారన్న ప్రచారం వల్ల లభించిన సానుభూతి, తనకంటూ సొంత బలాన్ని అదివరకే సమకూర్చుకొని ఉండడం హుజూరాబాద్ లో ఈటల విజయానికి కారణాలు. 

మునుగోడులో అలాంటి పరిస్థితులేమీ లేవు. మునుగోడులో ఉపఎన్నికను బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం కోరుకుంటోంది. ప్రజలకు ఈ ఎన్నికలతో ఏమి సంబంధం? ప్రజలపై బలవంతంగా ఎన్నికలు రుద్దడం వల్ల వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? హుజూరాబాద్ లో ఉపఎన్నిక అనివార్యంగా వచ్చింది. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే దాని కారణాలను బీజేపీ ఎట్లా వివరించగలదు? ప్రజల్ని ఎట్లా మెప్పించగలదు?