తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్‌కు అగ్ని పరీక్ష పెట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది.
ఇప్పటికి తెలంగాణలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, రెండింటిలో బీజేపీ గెలుపొందింది. దుబ్బాక, హుజురాబాద్‌లలో రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ గెలుపొందగా, నాగార్జునసాగర్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అధికారంలో ఉంటూ టీఆర్ఎస్ ఓడిపోవడం సంచలనం కలిగించింది.
2023లో తెలంగాణలో పాగా వేయాలని గట్టి పట్టుదలతో బీజేపీ వుంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బలమైన నేతలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంగీకరించి, ఉప ఎన్నికకు సిద్ధమైనట్టు సమాచారం.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం, ఆ తర్వాత కోమటిరెడ్డి టీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీనే అని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలున్నారు. అయితే ఆ అవకాశాన్ని కాంగ్రెస్‌కు ఇవ్వడానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిద్ధంగా లేరు. బీజేపీలో చేరేందుకు ఆయన పక్కా ప్రణాళిక రచించుకున్నారు.
రాజగోపాల్‌రెడ్డితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఆపరేషన్ ఆకర్ష్ ఇన్చార్జ్ ఈటల రాజేందర్ చర్చించారు. రాజగోపాల్‌రెడ్డి చేరికపై బండి సంజయ్ ఇవాళ తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా ఖమ్మం, నల్లగొండ నుంచి బీజేపీలో భారీ సంఖ్యలో చేరుతారని బండి సంజయ్ తెలిపారు.