విశాఖ ఆర్కే బీచ్‌లో పెళ్లి రోజు మిస్సింగ్ కేసులో యువతి ట్విస్ట్ ఇచ్చిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సముద్రంలో గల్లంతు అయ్యిందని, ఆమె ఆచూకీ కోసం రెండు రోజులుగా వెతుకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి నెల్లూరులో ప్రియుడి చెంత వుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. అసలేం జరిగిందంటే…
రెండురోజుల క్రితం సాయిప్రియ అనే యువతి తన పెళ్లి రోజు పురస్కరించుకుని భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్‌కి వెళ్లింది. సాయంత్రం 7 -7.30 గంటల సమయం. చిమ్మ చీకటి. భర్త సెల్‌కు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసుకుంటుండగా రెప్పపాటులో సాయిప్రియ అదృశ్యమైంది. సెల్ఫీ తీసుకుంటుండగా సాయిప్రియ సముద్రంలో గల్లంతు అయ్యిందనే వార్త ప్రచారమైంది.
అంత వరకూ తన పక్కనే ఉన్న భార్య కనిపించకపోవడంతో భర్త తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వెతికాడు. ఆమె ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెరైన్, నేవీ, ఏపీ పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు హెలికాప్టర్లతో పాటు కోస్ట్ గార్డ్ నేవీల సహాయంతో గాలిస్తున్నారు. ఇందుకోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు సమాచారం. మరోవైపు రెండు రోజులు గడుస్తున్నా సాయిప్రియ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ నేపథ్యంలో సాయిప్రియ అదృశ్యంపై షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. సాయిప్రియ సముద్రంలో గల్లంతు కాలేదని, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రియుడి దగ్గరికి వెళ్లిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ మేరకు సాయిప్రియ భర్తకు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పోలీసులు, కుటుంబ సభ్యులు ఇంకా నిర్ధారించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఆమె సురక్షితంగా ఉంటే చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.