ప్రత్యర్థులను దెబ్బ కొట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంటారు. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలతో జగన్ సన్నిహిత సంబంధాలను తెగ్గొట్టడానికి టీడీపీ, అలాగే బీజేపీలోని చంద్రబాబు మనుషులు నిత్యం పని చేస్తుంటారు. ఇందులో భాగమే తరచూ జగన్ పాలనపై కేంద్ర పెద్దలు దృష్టి సారించారని, తగిన సమయంలో సరైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడాన్ని గమనించొచ్చు.
ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఆంధ్రా యూనివర్సిటీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ తక్కువగా మాట్లాడినప్పటికీ, అనుకున్న ప్రయోజనాల్ని నెరవేర్చుకున్నారు. జనానికి తాను పంపదలుచుకున్న సంకేతాల్ని దిగ్విజయంగా చేరవేయగలిగారు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా జగన్ మాట్లాడిన ఆ మాటలేంటంటే….
“రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత మా ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా వుండదు” అని ప్రధాని మోదీ ఎదుట జగన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి వున్నట్టు ప్రధాని ఎదుటే స్పష్టం చేశారు. అలాగే ప్రధాని మోదీతో పవన్ భేటీ నేపథ్యంతో జగన్‌ను కట్టడి చేస్తారంటూ ఎల్లో మీడియా విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
అలా ప్రచారానికి తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలు, పార్టీలకు అతీతమని చెప్పడం ద్వారా… మోదీ సర్కార్‌తో తమకు సన్నిహిత సంబంధాలున్నాయనే మెసేజ్ పంపారు. తద్వారా తననెవరూ ఏమీ చేయలేరని ప్రత్యర్థు లకు హెచ్చరిక పంపారు. అందుకు తగ్గట్టుగానే బహిరంగ సభా వేదికపై మోదీ, జగన్ ఉల్లాసంగా ముచ్చట్లు చెప్పుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తనకు వ్యతిరేకంగా బీజేపీలోని టీడీపీ నాయకులు చేసే శ్రమ వృథా అని జగన్ పరోక్షంగా వారిని సభా వేదికపై నుంచి హెచ్చరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అండ ఉన్నంత వరకూ జగన్‌ను ఏమీ చేయలేమనే నిరాశనిస్పృహలు సీఎం వ్యతిరేకుల్లో అలుముకున్నాయి.