ప్రధాని మోదీతో జనసేనాని పవన్‌కల్యాణ్ భేటీపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అసలు మోదీతో పవన్ కలవనే లేదని నెటిజన్లు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీతో నిజంగా పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సమావేశమై వుంటే, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఎక్కడ? అని నిలదీస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ప్రముఖుల్ని కలిసినప్పుడు ఫొటోలను విడుదల చేస్తుంటారని, మరి పవన్ విషయంలో అలా ఎందుకు జరగలేదనే వాదన తెరపైకి వచ్చింది.
హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆతిథ్యానికి టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లినప్పుడు ఫొటోలను విడుదల చేయడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అమిత్‌షా కూడా తన సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఫొటోలు షేర్ చేయడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ, పవన్‌ను ఏకిపారేస్తున్నారు. గత ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడంపై తెలుగులో అమిత్‌షా ట్వీట్ చేయడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడని, తెలుగు సినిమా తారకరత్నం జూనియర్ ఎన్టీఆర్ అని అమిత్‌షా పేర్కొన్నారు. అలాగే అతనితో మాట్లాడ్డం తనకు ఆనందాన్ని ఇచ్చిందని అమిత్‌షా ట్వీట్ చేశారని, ఇప్పుడు పవన్ విషయంలో అలా ఎందుకు జరగలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అసలు మోదీతో పవన్ భేటీ జరగలేదు కాబట్టి అంటూ నెటిజన్లు తమదైన రీతిలో భాష్యాలు చెబుతున్నారు.
ఇదిలా వుండగా జనసేన అధికారిక సోషల్ మీడియా గ్రూపుల్లో ఎక్కడా కూడా మోదీతో పవన్ కలవడానికి సంబంధించి ఫొటోలు లేకపోవడం మరిన్ని అనుమానాలు, విమర్శలకు దారి తీసింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పవన్, నాదెండ్ల మనోహర్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
విమానాశ్రయం నుంచి పవన్, నాదెండ్ల మనోహర్ బయటికొస్తున్న వీడియోని మాత్రమే జనసేన అధికారిక సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం గమనార్హం. ప్రధానితో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ కావడం వాస్తవమే. అయితే కేంద్ర ప్రభుత్వం, పార్టీగా బీజేపీ ఎందుకనో ఈ భేటీకి ప్రాధాన్యం ఇవ్వలేదు. మోదీతో పవన్ భేటీ ఫొటోను విడుదల చేయకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.