పునాదిరాయి వేసిన రాజధానిట…లక్షల కోట్లిస్తారా…?

ఏపీ రాజధాని విషయంలో బీజేపీ నాయకులు చాలా పెద్ద మాటలే చెబుతున్నారు. అక్కడికి తాము మొత్తానికి మొత్తం నిధులు ఇచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మోడీ గారి మాటల్లో చెప్పాలంటే ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో…

ఏపీ రాజధాని విషయంలో బీజేపీ నాయకులు చాలా పెద్ద మాటలే చెబుతున్నారు. అక్కడికి తాము మొత్తానికి మొత్తం నిధులు ఇచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మోడీ గారి మాటల్లో చెప్పాలంటే ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో తామే నిర్మిస్తున్నట్లుగా ఆర్భాటం చేస్తున్నారు. మోడీ పునాది రాయి వేసిన అమరావతిని ఎవరైనా అడ్డుకుంటే ఊరుకుంటామా అని నిన్నటి తెలుగు తమ్ముడు నేటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొత్త పాయింట్ ని లేవదీసి మరీ వైసీపీ వారిని  ప్రశ్నిస్తున్నారు.

అమరావతి రాజధాని వివాదాన్ని పక్కన పెడితే ఏపీకి రాజధాని లేకుండా విడగొట్టిన పాపంలో బీజేపీకి సమాన భాగం ఉంది కాబట్టి ఏపీకి ఒక మంచి రాజధాని కేంద్రం నిర్మించి తీరాలి. అదే సమయంలో తాము ఏపీ రాజధానికి ఎంత సొమ్ము ఇవ్వగలమో కూడా ఏనాడో స్పష్టంగా చెప్పి ఉండాలి. కానీ నాటి ఏపీ సర్కార్ మీద అంతా వదిలేసి పునాది రాయి వరకూ  వేసేసి తమకు తోచినంత ఇచ్చేసి బాధ్యత తీరిపోయిందనుకున్న బీజేపీ వారు ఇపుడు అమరావతి మీద వేలు కాలూ పెడితే ఊరుకోమని చెప్పడమే వింతగా ఉంది అంటున్నారు.

నాడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ లక్షల కోట్ల భారీ బడ్జెట్ తో రాజధానిని నిర్మించాలనుకున్నపుడు అంత సొమ్ము తాము ఇవ్వలేమని మొదటే చెప్పి ఉండాలి. అలా కాకుండా మేము ఇంత వరకూ పెట్టగలమని అయినా చెప్పాలి ఏమీ చెప్పకుండా చేయకుండా ఇపుడు అమరావతి రాజధాని జోలికొస్తే ఊరుకోమని సీఎం రమేష్ లాంటి కొత్తగా ఆ పార్టీలో చేరిన వారు అంటున్నారు అంటే అది బీజేపీ అభిప్రాయం అనుకోవాలా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

ఇక్కడ రమేష్ కి గుర్తు ఉందో లేదో రాజధాని అన్నది రాష్ట్రం వ్యవహారం అని కేంద్రం కోర్టుకు అఫిడవిట్ కూడా ఇచ్చింది కూడా. అమరావతి రైతుల పాదయాత్ర మీద మాటల దాడి చేసినా విమర్శలు చేసినా నేరుగా బీజేపీ మీద చేసినట్లే అని రమేష్ అంటున్నారు. 

తాము కూడా వారితో కలసి అడుగులు వేసి రక్షణ కవచంగా ఉంటామని చెబుతున్నారు. కేంద్రం వైసీపీకి మద్దతుగా లేదని, అన్నీ కేంద్రంతో చెప్పి వైసీపీ సర్కార్ పెద్దలు చేస్తున్నామని అంటున్నది కూడా అవాస్తవం అని ఆయన అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే బీజేపీ ఎంపీ గారి గొంతులో టీడీపీ స్వరం పలుకుతోందనే వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.