రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. పోలవరం ఎత్తు, భద్రాచలం జలమయం, ఏపీ-తెలంగాణ మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతుండడాన్ని ఆయన గ్రహించినట్టు లేరు. అకస్మాత్తుగా మేల్కొన్న ఆయన … తెలుగు సమాజంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయో తెలియక ఏవేవో మాట్లాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాచలం వరదలో చిక్కుకోడానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అకస్మాత్తుగా నీళ్లు వదలడమే అన్నారు. అయితే పోలవరం ఎత్తు పెంచడం వల్లే భద్రాచలాన్ని గోదావరి వరద ముంచెత్తిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన ఆరోపణ చేశారు. కావున వరద ముంపు మండలాలను తిరిగి తమకు పెద్ద మనసుతో అప్పగించాలని ఆయన కోరారు.
పువ్వాడ అజయ్ డిమాండ్‌పై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌ను ఏపీలో విలీనం చేయాలని తాము కోరుతామని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. పోలవరం ఎత్తుకు, భద్రాచలం వరదకు ఏ మాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అనవసరంగా పాతగాయాల్ని గెలకొద్దని తెలంగాణ మంత్రి పువ్వాడకు ఏపీ మంత్రి అంబటి సూచించారు.
విలీన గ్రామాలు, అలాగే పోలవరం ఎత్తుపై అనవసర రాద్ధాంతం చేయొద్దని, అదంతా ముగిసిపోయిన అధ్యాయమని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కోలేక సంబంధం లేని అంశాల్ని తెరపైకి తెచ్చారని మంత్రి సురేష్ ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ సీరియస్ రియాక్షన్ ఇది.
అయితే ఇవేవీ తెలుసుకోని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ మిత్రుడైన సీఎం రమేశ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం వరదలో చిక్కుకుందని విమర్శించినా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఘాటుగా తిప్పికొట్టలేదన్నారు. కేసీఆర్‌తో జగన్‌కు సన్నిహితం వల్లే తెలంగాణ ఆరోపణల్ని దీటుగా తిప్పికొట్టలేదనడం గమనార్హం.
ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. అయితే సీఎం రమేశ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. వాస్తవాలేవీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడ్డం సీఎం రమేశ్‌కే చెల్లిందన్నారు. టీడీపీకి లబ్ధి కలిగించేందుకే సీఎం రమేశ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కసారి కళ్లు తెరిచి, చెవులతో వింటే ఏపీ ప్రభుత్వ దీటు సమాధానం ఏంటో తెలుస్తుందని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు. నిద్రపోయే వాళ్లను మేల్కొల్పొచ్చని, నటించే వాళ్లను ఏం చేయగలమని సీఎం రమేశ్ ధోరణిపై సెటైర్స్ విసురుతున్నారు.