మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డిని మరోసారి జైల్లో పెట్టాలనే పట్టుదలతో ఉంది. హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి ఏ-1 నిందితుడు. ఈయనకు గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం ఎర్రగంగిరెడ్డి పులివెందులలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. దీంతో ఎర్రగంగిరెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడని, బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే వివేకా హత్య కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ పేరుతో నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ఉండలేమని పేర్కొంది. విచారణకు ఇంకెంత సమయం పడుతుందో చెప్పాలని సీబీఐని హైకోర్టు గతంలో గట్టిగా నిలదీసింది. అయితే ఈ కేసులో పెద్దల హస్తం ఉందని, మున్ముందు కీలక అరెస్ట్‌లు ఉండొచ్చని కూడా సీబీఐ పేర్కొంది. కానీ విచారణే తప్ప, కొత్తగా అరెస్టులు జరగలేదు.
ఎర్రగంగిరెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయాలో సరైన కారణం చూపకపోవడంతో సీబీఐ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.
సెషన్స్ కోర్టు, హైకోర్టులలో సరైన ఆధారాలను సమర్పించని సీబీఐ, సర్వోన్నత న్యాయస్థానానికి ఏం చెబుతుందోననే చర్చకు తెరలేచింది. కానీ ఎర్రగంగిరెడ్డిని ఎలాగైనా జైల్లో పెట్టాలనే పట్టుదలతో సీబీఐ ఉందనే సంగతి తాజా పిటిషన్‌తో స్పష్టమైంది. సీబీఐ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో మరి!