మహా విశాఖ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో ఇపుడు ఒక అతి పెద్ద ఉద్యమమే సాగుతోంది. దాదాపుగా నెల రోజులకు పైగా నో ప్లాస్టిక్ అంటూ సాగుతున్న ఈ ఉద్యమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు సినీ సెలిబ్రిటీస్, క్రికెటర్స్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు అంతా కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు.
ఈ రోజు ప్రపంచాన్ని ప్లాస్టిక్ కబలించివేస్తోంది. ప్లాస్టిక్ లేని జీవితం లేదని అంటోంది. మానవ శరీరాలలో ప్లాస్టిక్ అవశేషాలు పూర్తిగా ఉంటున్న పరిస్థితి. ఇక జంతుజాలాల సంగతి అసలు చెప్పనవసరమే లేదు. కాదేదీ అన్నట్లుగా చెట్టూ చేమా నదీ నదాలు, మహా సాగరాల నిండా ప్లాస్టిక్ రక్కసి ఆవరించి పెను సవాల్ చేస్తోంది.
ఈ నేపధ్యంలో ప్లాస్టిక్ భూతం ఇందు గలడు అందు లేడు అన్న సందేహం వదలని చెప్పి మరీ జనావళిని కబలించేందుకు సిద్ధపడుతోంది. మరి ఈ నేపధ్యంలో అతి పెద్ద యుద్ధమే చేయాలి. దానికి విశాఖ నగరపాలక సంస్థ సంసిద్ధమైంది. ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకుని యాగంగా నిర్వహిస్తోంది.
పాఠశాలల స్థాయి నుంచి అన్ని చోట్లా కూడా అవగాహన కల్పిస్తోంది. ప్లాస్టిక్ వద్దు అంటూ సాగుతున్న ఈ ప్రచారానికి నగర వాసుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దానికి కారణం అంతా ప్లాస్టిక్ కి వ్యతిరేకమే అయినా ఈ మహమ్మారిని వదిలించుకోవడం ఎలాగో తెలియక మాత్రమే. ఆల్టర్నేషన్ సరైనది ఉంటే మాత్రం విశాఖ నో ప్లాస్టిక్ సిటీగా మారి రాష్ట్రానికి దేశానికీ ఆదర్శం అవుతుంది. ఈ విషయంలో జీవీఎంసీ కమిషనర్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.