ఏపీలో కేసీఆర్‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు పెట్టాలంటే అక్క‌డి స‌మాజం, రాజ‌కీయ నాయ‌కులు కొన్ని ష‌ర‌తులు పెడుతున్నారు. ఆ ష‌ర‌తుల‌కు అంగీక‌రించిన త‌ర్వాతే ఏపీలో అడుగు పెట్ట‌నిస్తామ‌ని వారు అంటున్నారు. అంత వ‌ర‌కూ కేసీఆర్‌ను…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు పెట్టాలంటే అక్క‌డి స‌మాజం, రాజ‌కీయ నాయ‌కులు కొన్ని ష‌ర‌తులు పెడుతున్నారు. ఆ ష‌ర‌తుల‌కు అంగీక‌రించిన త‌ర్వాతే ఏపీలో అడుగు పెట్ట‌నిస్తామ‌ని వారు అంటున్నారు. అంత వ‌ర‌కూ కేసీఆర్‌ను రానివ్వ‌మ‌ని కొంత మంది నేతలు హెచ్చ‌రిస్తుండ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేత‌లు కేసీఆర్‌పై ఫైర్ అవుతున్నారు. మిగిలిన పార్టీల నేత‌లు కేసీఆర్‌ను లైట్ తీసుకున్నారు.

కేసీఆర్‌కు ఏపీ బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు కొన్ని షర‌తులు విధించారు. అవేంటో తెలుసుకుందాం.

తెలుగు త‌ల్లికి క్ష‌మాప‌ణ చెప్పిన త‌ర్వాతే కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. అలాగే ఎంతో మంది మ‌హ నీయుల విగ్ర‌హాల‌ను కేసీఆర్ నేతృత్వంలో ధ్వంసం చేశార‌ని, వారి కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరారు. క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు తెలంగాణ త‌ల్లిని ఎలా తీసుకొస్తారో చెప్పాల‌ని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. దేశాన్ని ఏకం చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న కేసీఆర్‌, ముందుగా ఏపీ నీటి ప్రాజెక్టుల‌పై త‌న వైఖ‌రి ఏంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఏపీతో తెలంగాణ‌కు సాగునీటి ప్రాజెక్టులు, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లున్న సంగ‌తి తెలిసిందే. వీటిని తెర‌పైకి తెచ్చి కేసీఆర్ పార్టీని ఇర‌కాటంలోకి నెట్టాల‌ని బీజేపీ నేత‌లు వ్యూహం ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌పై విష్ణు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డాన్ని చూడొచ్చు. రానున్న రోజుల్లో ఏపీపై నాడు ఉద్య‌మ‌నేత‌గా కేసీఆర్ వాడిన అస‌భ్య, అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌కు సంబంధించి వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం వుంది.