అమరావతి రాజధాని కోసం చేస్తున్న పాదయాత్రికులపై మంత్రి ధర్మాన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎల్లో మీడియా తెగ బాధపడిపోతోంది. పాదయాత్ర చేస్తున్న రైతులు, మహళలపై మంత్రి అభ్యంతరకర భాష ఎలా వాడతారని ఎల్లో మీడియా నిలదీస్తోంది. పోనీ ధర్మాన ఏమైనా వాడకూడని భాష వాడారా? అంటే అదేం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయంగా చితక్కొట్టాలని ధర్మాన స్పష్టంగా పిలుపునిచ్చారు.
అమరావతి రాజధాని కోసం మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్టైతే… ఇటీవల గుడివాడకు చేరినప్పుడు వారు వ్యవహరించిన తీరు మరోసారి తెరపైకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా తొడకొట్టి ఎమ్మెల్యే కొడాలి నానికి సవాల్ విసిరింది. అలాగే మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు కొడాలి నానికి దమ్ముంటే బయటికి రావాలని, తేల్చుకుందామని సవాల్ విసరడాన్ని గుర్తు చేస్తూ, ఎల్లో మీడియా ఓవరాక్షన్‌పై కౌంటర్లు విసురుతున్నారు.
పాదయాత్రను శాంతియుతంగా చేసుకోకుండా, అమరావతిని వ్యతిరేకించిన ప్రజాప్రతినిధుల స్వస్థలాలకు వెళ్లి ప్రగల్భాలు పలుకుతారా? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమకు గిట్టని నాయకులపై తొడలు కొడితే, మీసాలు తిప్పితే మాత్రమే వీరులని, ప్రత్యర్థులు ఘాటుగా రిప్లై ఇస్తే దుర్మార్గమని చెప్పడం పచ్చ బ్యాచ్‌కు చెల్లిందని సోషల్ మీడియాలో చితక్కొడుతున్నారు.
విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని పాదయాత్రగా వెళుతున్న వారిపై ఆ ప్రాంత నాయకుడిగా ధర్మాన ప్రసాదరావు ఆగ్రహాన్ని అర్థం చేసుకోదగ్గదే అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో చెబుతూ, ఇందులో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
‘మా పీక కోసేటందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్రగా వస్తున్నారా? మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా? ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు.. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి ’ అని ధర్మాన పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని ధర్మాన ఎంతో ఆవేదనతో వేడుకోవడాన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే విశాఖ రాజధానికి అడ్డొస్తే… అది కూడా రాజకీయంగా చితక్కొట్టాలని ధర్మాన అంటే తప్పు ఎలా అవుతుందని నిలదీస్తుండడం గమనార్హం. ఇదే మాట అమరావతి పాదయాత్ర చేసే వాళ్లు అంటే మాత్రం ఎల్లో మీడియాకి అపురూపంగా ఉంటుందా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.