హోదాపై ఇలా సిగ్గులేని మాటలు ఎన్నాళ్లు?

ప్రత్యేక హోదా అనే పదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా ఎంత కాలం పాటు వంచిస్తారు? ఇంకా ఎంత కాలం పాటు వారి భావోద్వేగాలతో ఆడుకుంటారు? ఇంకా ఎంత కాలం పాటు ‘వారిని బుట్టలో…

ప్రత్యేక హోదా అనే పదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా ఎంత కాలం పాటు వంచిస్తారు? ఇంకా ఎంత కాలం పాటు వారి భావోద్వేగాలతో ఆడుకుంటారు? ఇంకా ఎంత కాలం పాటు ‘వారిని బుట్టలో పడేయగలం’ అని భ్రమల్లో బతుకుతారు? కాంగ్రెస్ పార్టీ నాయకుల తాజా మాటలు వింటుంటే చీదర పుడుతోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక రాజకీయ వంచనాపూర్వక గిమ్మిక్ మాదిరిగా తయారైపోయిందనే సంగతి ప్రజలకు ఏనాడో ధ్రువపడిపోయింది. అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పదం చెప్పి మోసం చేసే వాళ్లే తప్ప.. ప్రత్యేక హోదా అనే అమృతతుల్యమైన వరాన్ని రాష్ట్రం కోసం సాధించే చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఒక్కటి కూడా లేదు.. అనేది ప్రజలకు తెలిసిపోయింది. 

ప్రజలు కూడా ఈ స్వార్థపూరిత రాజకీయ నాయకుల మీద.. హోదాకు సంబంధించి ఆశలు పెట్టుకోవడం మానేశారు! అసలు హోదా వస్తుందని ఆ రూపేణా తమ బతుకులు బాగుపడతాయని ఆశలకు కూడా వాళ్ళు తిలోదకాలు ఇచ్చేశారు! ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ సిగ్గు లేకుండా ప్రత్యేక హోదా అనే మాట ఎత్తుతోంది! కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తాం అనే మాట చెబుతోంది! ఇంతకంటే చవక బారు వ్యవహారం మరొకటి ఉండదు. 

ప్రత్యేక హోదా అనే అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచకుండా మొదటి వంచనకు పాల్పడినది కాంగ్రెస్ పార్టీ. అలాంటివాళ్లు ఇప్పుడు మళ్లీ హోదా పాట ఎందుకు పాడుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే హోదా ఇస్తాం అని సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు?

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ప్రధానమంత్రి రాహుల్ సాగిస్తున్న భారత్ జోడో పాదయాత్ర ఈనెల 18వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. 13 రోజులపాటు 95 కిలోమీటర్ల మేర ఏపీలోనే సాగుతుంది. ఆ నేపథ్యంలోనే రాహుల్ కు మద్దతుగా జనాదరణను కూడగట్టడానికి కాంగ్రెస్ నాయకులు ఈ ఎత్తుగడ వేసినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులంతా ఓ ప్రెస్ మీట్ పెట్టి మేము గెలవగానే మీకు హోదా ఇచ్చేస్తాం అనే పాట పాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క తాజా పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు ఆ పార్టీ ‘శవాసనం వేసి ఉంది’ అనడానికి కూడా వీల్లేదు.. ఎన్నడో మరణించింది! వాళ్లు సమాధి కట్టకుండా రోజులు నెడుతున్నారు అంతే. 

రాహుల్ కాదు కదా సోనియా వచ్చి రోడ్ల వెంట నడిచినా వారి వెంబడి ఊరేగుతున్న వందిమాగధులు తప్ప ప్రజలు ఆదరిస్తారనే గ్యారెంటీ ఎంత మాత్రమూ లేదు. ఆలాంటి నేపథ్యంలో సన్నాహకంగా ఏర్పాట్లు చూస్తున్న జైరామ్ రమేష్, దిగ్విజయసింగ్ లాంటి మహామహులు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం అనే బిస్కెట్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం వెల్లువ లేకుండా రాహుల్ పాదయాత్ర 95 కిలోమీటర్ల మేర నీరసంగా సాగితే పార్టీ పరువు పోతుందని వారు భయపడుతున్నారు.

విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ కు అత్యంత ద్రోహం చేసిన మేధావి జైరాం రమేష్ ఇప్పుడు తెలుగు ప్రజలను మరోసారి మోసం చేయడానికి పూనుకోవడం పార్టీకి ఇంకా సిగ్గుచేటు. ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీదే ఆ బాధ్యత అని, 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ అనడం ఇంకా ఘోరం. ప్రత్యేక హోదా అనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అయినప్పుడు మోడీ ఏలుబడి సాగించిన, సాగించబోతున్న పదేళ్లపాటు వారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? 

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా? బాధ్యత తమది అని ఈరోజు రాహుల్ యాత్రకు జనాన్ని సమీకరించడం కోసం నంగి మాటలు చెబుతున్న దిగ్విజయ సింగ్ ఇదే హోదాను సాధించడం కోసం పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి పెంచి పోరాడడం తమ బాధ్యత అని ఏనాడూ అనుకోలేదే! ఇవాళ తాను రోడ్డు మీద నడుస్తూ ఉంటే జనం వెల్లువలా వచ్చి తనకు స్వాగత నీరాజనాలు పలకాలని కోరుకుంటున్న రాహుల్ ఏనాడూ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు హోదా కోసం ప్రత్యేకంగా గళమెత్తి  నినదించలేదే! ఏపీ ప్రజలు అసలు కాంగ్రెస్ ను ఎందుకు నమ్మాలి. కొత్తగా వంచించడానికి వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఎదుటకు వచ్చి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జీవిత పర్యంతమూ సిగ్గుపడుతూనే ఉండాలి. ఇప్పటికి చేసిన ద్రోహాలు చాలు వాటిని దిద్దుకోవడం కూడా వారికి చేతకాదు. ఇంకెక్కడైనా సీట్లు సంపాదించుకుని రాగల బలంతో అధికారంలోకి వచ్చి ఏపీకి న్యాయం చేస్తే.. అప్పటికి గాని వారిని ప్రజలు నమ్మరు. 2024 లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా అధికారంలోకి వచ్చినా హోదా ఇవ్వరుగాక ఇవ్వరు! మా పార్టీ సింగిల్ గా అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండా ఇచ్చే వాళ్ళం అనే నంగి మాటలను మళ్లీ వెల్లడిస్తారు. 

ఇలాంటివి చూసి చూసి ప్రజలకు తల పండిపోయింది. ఎవరూ ఇలాంటి నాటకాల మాటలను నమ్మే స్థితిలో లేరు. కాబట్టి కాంగ్రెసు పార్టీ.. రాహుల్ జోడో యాత్రకు ఏపీలో కూడా జనం స్పందన కావాలనుకుంటే.. నిధులు బయటకు తీసి.. ప్రజలకు డబ్బులిచ్చి తోలించుకోవడం మంచిది.