ష‌ర్మిల కోపం కేసీఆర్‌పైనా? అన్న‌పైనా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కేవ‌లం రాజ‌కీయ పోరాటం చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. కేసీఆర్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు రాజ‌కీయ ప‌రిధులు దాటాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌ను ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ఎందుకు…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కేవ‌లం రాజ‌కీయ పోరాటం చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. కేసీఆర్‌పై ష‌ర్మిల విమ‌ర్శ‌లు రాజ‌కీయ ప‌రిధులు దాటాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌ను ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ఎందుకు టార్గెట్ చేశారో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ష‌ర్మిల కోపం కేసీఆర్‌పైనా? లేక త‌న అన్న జ‌గ‌న్‌పైనా? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. త‌న అన్న‌కు స‌న్నిహిత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డం వెనుక ష‌ర్మిల వ్యూహం ఏమై వుంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. రాజ‌న్న రాజ్యం తీసుకొస్తాన‌ని ష‌ర్మిల బ‌య‌ల్దేరారు. టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ నేత‌ల‌పై ష‌ర్మిల తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా తెలంగాణ‌లో ఎదుగుతున్న బీజేపీపై మాత్రం ష‌ర్మిల చిన్న విమ‌ర్శ కూడా చేయ‌డం లేదు. ఇది ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. బీజేపీ వ‌దిలిన బాణం ష‌ర్మిల అని టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌లం క‌లిగించేలా ఆమె న‌డుచుకుంటున్నారు.

కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డంలో ష‌ర్మిల మ‌రో ముంద‌డుగు వేస్తున్నారు. కేసీఆర్ భారీగా అక్ర‌మ ఆస్తులు కూడ‌బెట్టార‌ని, భ‌ర‌తం ప‌ట్టాలంటూ ఏకంగా సీబీఐ, కేంద్ర‌హోంశాఖ‌కు ఫిర్యాదు చేయ‌డానికి ఆమె సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా ద‌స‌రా మ‌రుస‌టి రోజు అంటే 6వ తేదీ ఢిల్లీ వెళ్ల‌డానికి ఆమె ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాల‌తో స‌హా సీబీఐ, కేంద్ర‌హోంశాఖ అధికారుల‌కు ఆమె ఫిర్యాదు చేయ‌నున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై కూడా విచార‌ణ జ‌ర‌పాల‌ని ష‌ర్మిల కోర‌నున్నారు.  

కేసీఆర్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేత‌లు చేయ‌లేని ప‌ని…తాజాగా ష‌ర్మిల చేస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ష‌ర్మిల‌ను అడ్డు పెట్టుకుని కేసీఆర్‌ను ఇర‌కాటంలో పెట్ట‌నున్నారా? అనే అనుమానం త‌లెత్తుతోంది. అది కూడా జాతీయ పార్టీ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజు నుంచే కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదులు స్వీక‌రిస్తుండ‌డం, అనంత‌రం విచార‌ణ త‌దిత‌ర అంశాలు తెర‌పైకి రావ‌డం వెనుక ఏదో వ్యూహం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.