ప్రతిదీ రాజకీయం చేయడం టీడీపీకి వ్యసనంగా మారింది. కనీసం దేవస్థానం వద్ద అయినా రాజకీయాలను పక్కన పెట్టాలన్న సంస్కారం లేకపోవడం విమర్శలు తావిస్తోంది. తాజాగా ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు.
ఆయనకు మర్యాదల విషయంలో ఆలయ అధికారులు ఎలాంటి లోటు చేయలేదు. కానీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. బాలయ్య మనస్తత్వం ఎలాంటిదో ఈ చిన్న సంఘటనే తెలియజేస్తోంది.
తనకు వీవీఐపీ ప్రొటోకాల్ ఉన్నా సమాచారశాఖ మీడియా పాయింట్ వద్ద మైక్ ఏర్పాటు చేయకపోవడాన్ని బాలయ్య విమర్శించారు. సమాచార నిర్లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. భక్తుల అరుపులు, కేకల మధ్యలో బాలయ్య గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని ఎల్లో మీడియా తెగ బాధపడిపోతూ రాసుకొచ్చింది. బాలకృష్ణను అవమానించాలనేది ప్రభుత్వ ఉద్దేశమైతే ఆయనకు ఆలయంలో ఘన స్వాగతం ఎందుకు పలుకుతారు? వీవీఐపీ మర్యాదల్ని ఆలయంలో ఎందుకు చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం విమర్శలకు దారి తీసింది.
ఒకవేళ మైక్‌లు లేని కారణంగా బాలయ్య కాస్త గట్టిగా మాట్లాడితే నష్టమేంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ స్టాపబుల్ రెండో భాగాన్ని ప్రారంభిస్తున్నట్టు బాలయ్య చెప్పడం విశేషం. పనిలో పనిగా అన్ స్టాపబుల్ కాంట్రవర్సినీ కూడా బాలయ్య కొనసాగిస్తున్నారనే నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.