కోర‌మండ‌ల్ రైల్లో తెలుగు ప్ర‌యాణికులు ఎంత‌మంది అంటే!

కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. వంద‌ల సంఖ్య‌లో మృతులు ఉండ‌డంతో దేశ ప్ర‌జానీకం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదే సంద‌ర్భంలో బాధితులు తెలుగువారున్నార‌నే వార్త మ‌రింత ఆవేద‌న క‌లిగిస్తోంది.…

కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. వంద‌ల సంఖ్య‌లో మృతులు ఉండ‌డంతో దేశ ప్ర‌జానీకం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదే సంద‌ర్భంలో బాధితులు తెలుగువారున్నార‌నే వార్త మ‌రింత ఆవేద‌న క‌లిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌యాణికులు ఎంత మంది ఉన్నారు? ఎవ‌రెవ‌రున్నారు? మృతులు, తీవ్ర గాయాల‌పాలైన వారు, అలాగే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన వారెవ‌రు ఉన్నారో అనే లెక్క‌లు వేయ‌డంలో ప్ర‌భుత్వ యంత్రాంగం నిమ‌గ్న‌మైంది.

ఏఏ బోగీల్లో తెలుగు ప్ర‌యాణికులు ఉన్నార‌నే స‌మాచారం సోష‌ల్ మీడియాలో పేర్లు, సెల్ నంబ‌ర్ల‌తో స‌హా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ రైలు ప్ర‌మాద దుర్ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎక్కిన తెలుగు ప్ర‌యాణికులు 170 మంది ఉన్నార‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన‌, గాయాల‌పాలైన‌, అలాగే త‌ప్పిపోయిన వారి వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్టు మంత్రి చెప్పారు.

ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌యాణికులు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. మ‌రికొంద‌రు ప్ర‌మాదానికి ముందే దిగిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఫోన్ చేస్తున్నా అందుబాటులోకి రాని ప్ర‌యాణికుల కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. కొంద‌రి సెల్‌ఫోన్లు స్విచ్ఛాప్ అయిన‌ట్టు వ‌స్తోంది. దీంతో త‌మ‌వారికి ఏమైందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ విషాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఏపీ మంత్రి దుర్ఘ‌ట‌న స్థ‌లానికి వెళ్లడం అభినందించ‌ద‌గ్గ విష‌యం. బాధితుల ఆవేద‌న‌ను అర్థం చేసుకుని వెంట‌నే వివ‌రాల‌ను తెలుసుకుని, స‌మాచారాన్ని ఇవ్వాల్సి వుంది. మంత్రితో పాటు మ‌రికొంద‌రు ఉన్న‌తాధికారులు వెళ్లిన‌ట్టు తెలిసింది.