జీవో నంబర్-1 విషయంలో ఏపీ సర్కార్‌ను హైకోర్టే కాపాడాలి. ఈ జీవో అమలుపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జీవో జారీ వెనుక సదుద్దేశమే తప్ప, ఇతరుల హక్కుల్ని కాలరాసే ఆలోచన లేదని పోలీస్ ఉన్నతాధికారులు, వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం విపరీత ధోరణులకు వెళ్తోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో జీవో అమలుపై ఇటు ముందుకెళ్లలేక, అటు వెనక్కి వెళ్లలేని దయనీయ స్థితి ప్రభుత్వానిది.
ఈ నేపథ్యంలో హైకోర్టులో జీవో నంబర్-1పై వ్యతిరేక ఉత్తర్వులు రావాలని అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు. కనీసం కోర్టు తీర్పు సాకైనా చెప్పుకుని, ఆ జీవో ఉత్తర్వుల రగడ నుంచి బయటపడాలని అధికార పార్టీ కోరుకుంటోంది. ఒకవేళ తనకు తాను వెనక్కి తగ్గితే… తమ పోరాటాలకు, ప్రజావ్యతిరేకతకు భయపడి జగన్ ప్రభుత్వం తోక ముడించిందనే విమర్శలు వస్తాయనేది వైసీపీ నేతల బాధ.
ఈ పరిస్థితిలో చంద్రబాబు మిత్రుడు, టీడీపీ అనధికార ప్రతినిధి అయిన సీపీఐ నేత రామకృష్ణ జీవో నంబర్-1 ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై 12న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించనుంది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్ విచారించనున్నట్టు సమాచారం. ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడానికే రాష్ట్రప్రభుత్వం జీవో నంబర్-1 తీసుకొచ్చిందని సీపీఐ రామకృష్ణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు, రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్ర్య హక్కుకు విరుద్ధంగా ఉన్న ఉత్తర్వు రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తామెక్కడా సభలు, సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పలేదని ఏపీ పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో హైకోర్టు తీర్పుపై అందరి దృష్టి పడింది.