కొన్ని టీవీ చానళ్ళు మా శత్రువులు….!

డైరెక్ట్ గా కుండబద్ధలు కొట్టినట్లుగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సత్యం చెప్పారు. మా పార్టీకి మా ప్రభుత్వానికి కొన్ని టీవీ చానళ్ళు శత్రువులు అని స్పష్టం చేశారు. ఆ టీవీ చానళ్ల పేర్లు…

డైరెక్ట్ గా కుండబద్ధలు కొట్టినట్లుగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సత్యం చెప్పారు. మా పార్టీకి మా ప్రభుత్వానికి కొన్ని టీవీ చానళ్ళు శత్రువులు అని స్పష్టం చేశారు. ఆ టీవీ చానళ్ల పేర్లు ధర్మాన చెప్పనక్కరలేదు, రాజకీయాలు ఆసక్తిగా అనుసరించే వారికి ఏమిటి అన్నవి తెలుసు. ఆంధ్రాలో రాజకీయంగా టీవీ చానళ్ళు విడిపోయిన నేపధ్యం నుంచి చూసినపుడు మంత్రి గారి మాటల వెనక అర్ధాలు బోధపడతాయి.

తన మీద అవినీతిపరుడు అని ముద్ర వేస్తున్న టీవీ చానళ్ల మీద ఆయన మండిపడ్డారు. రెవిన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని అలాంటిది తాను భూములు ఎలా దోచుకుంటానో సదరు టీవీ చానళ్ళు చెప్పాలని ధర్మాన డిమాండ్ చేశారు.

నా మీద ఊరకే బురద జల్లడం కాదు తాను అవినీతికి పాల్పడినట్లుగా రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అని ఆయన సవాల్ చేశారు. ప్రజల కోసం మంచి పనులు తమ ప్రభుత్వం చేస్తే వాటిని పక్కన పెట్టి అవినీతి చేస్తోంది సర్కార్ అని తప్పుడు వార్తలు రాస్తున్నారు అని మంత్రి ఫైర్ అయ్యారు.

నా దగ్గర మా ప్రభుత్వ వ్యతిరేక చానళ్ళు ఒక రిపోర్టర్ ని పెడతారు. నేను చెప్పిన వాటిని ఎడిటింగ్ చేసి మధ్యలో ఉన్న మ్యాటర్ ని తమకు అనుకూలంగా పెడుతూ నన్ను బదనాం చేస్తున్నారు అని ధర్మాన విరుచుకుపడ్డారు. నేను రిపోర్టర్ ని ఏమీ అనను ఎందుకంటే ఆయన ఒక ఉద్యోగి మాత్రమే. ఆ టీవీ చానళ్ల యాజమాన్యం తీరు అలా ఉంది అన్నదే నా ఆరోపణ,ఆవేదన అని ధర్మాన అంటున్నారు.

మంత్రి గారు తాను  అన్న దాన్ని వక్రీకరించి టీవీ చానళ్ళు చూపిస్తున్నాయని అంటున్నారు. ఇది ఆయన ఒక్కరి విషయంలోనే కాదు వైసీపీ ప్రభుత్వంలోని వారి మీద ఎమ్మెల్యేలు నాయకుల మీద పార్టీ నేతల మీద ఫోకస్ పెట్టి మరీ యాంటీ మీడియా అలా పనిచేస్తోంది అని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ నాయకులు తోటి ప్రత్యర్ధి పార్టీల మీద రాజకీయ విమర్శలు చేయాలి కానీ కొన్ని మీడియా సంస్థల  మీద కూడా యుద్ధం చేయడం అంటే ఏపీ రాజకీయాన్ని ఎవరూ బాగుచేయలేడు అనే అనుకోవాలి.