పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి చిత్రాలతో ప్రామిసింగ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఇందులో ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 14న “కళ్యాణం కమనీయం” విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు సినిమాలో నటించిన అనుభవాలు తెలిపారు సంతోష్ శోభన్.
సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. నాన్న దర్శకత్వంలో ప్రభాస్ అన్న నటించిన వర్షం సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అయ్యింది. ఇవన్నీ కో ఇన్సిడెంటల్ గా మా మూవీకి కలిసొచ్చాయి.
ఏక్ మినీ కథ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు “కళ్యాణం కమనీయం” కథ విన్నాను. నా మిత్రుడు, ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అజయ్ దర్శకుడు అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. మనం రెండు రకాల సినిమాలు చూస్తుంటాం. ఒకటి ఆస్పిరేషనల్, రెండోది రిలేటబుల్. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.
నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్ లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఫేక్ నెస్ లేదు. ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుంది. మనం బాగా నటిస్తున్నామనే అప్రిషియేషన్ కోసం ప్రయత్నిస్తే ఆ నటనలో జెన్యూనిటీ పోతుంది. ఆ క్యారెక్టర్ గానే ప్రవర్తించాను.
లైఫ్ అంటే ఒకరి మీద మరొకరం ఆధారపడటం. నాన్న మాకు దూరమైనప్పుడు అమ్మ మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచింది. అప్పుడు అమ్మ మీద ఆధారపడ్డాను. లైఫ్ లో ఒక సందర్భం వస్తే భార్య సంపాదన మీద భర్త కొంతకాలం లైఫ్ లీడ్ చేస్తాడు. అది వాళ్లిద్దరికి మధ్య సమస్య. భార్యా భర్తలకు ఇష్టమైతే వాళ్ల జీవితాన్ని ఎలాగైనా గడుపుతారు. నేను నిజ జీవితంలో జాబ్ లేకుంటే బాధపడాలి. నేను ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నా కాబట్టి పర్సనల్ గా తీసుకోలేదు.
కథల ఎంపికలో నిర్ణయం నాదే. నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్స్ క్రెడిట్ తీసుకుంటా. అప్పుడే మనశ్సాంతిగా ఉంటుంది. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ లో అన్ని మంచి శకునములే అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కాకుండా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నాను.