ఆంధ్రలో టికెట్ ల పెంపు జీవో ఇంకా బయటకు రాలేదు. రాత్రికి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు సినిమాల నిర్మాత మైత్రీ మూవీస్ తరపు ప్రతినిధులు అమరావతి లో సిఎమ్ పేషీ దగ్గర ఈ రోజు అంతా పడిగాపులు పడ్డారు. ఆఖరికి వీరసింహారెడ్డి సినిమాకు 20 రూపాయలు, వాల్తేర్ వీరయ్యకు 25 రూపాయల వంతున టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఈ రేట్ల కోసమే ఇప్పటి వరకు బుకింగ్ లు ఓపెన్ చేయకుండా వున్నారు. ఇప్పుడు ఈ మేరకు జీవో వస్తే బుకింగ్ లు తెరుచుకుంటాయి. ఇదిలా వుంటే ఎగ్జిబిషన్ సెక్టార్ జనాలు మాత్రం ఈ పెంపు పట్ల పెదవి విరుస్తున్నారు. ఈ పెంపు వున్నా,లేకున్నా ఒకటే అంటున్నారు. ఎందుకంటే ఈ 25 రూపాయల్లో మళ్లీ 18 శాతం జిఎస్టీ కింద ప్రభుత్వానికే ఆదాయం వెళ్తుంది.
ఏదో దంపిన దానికి బొక్కిందే కూలి అన్నట్లు ఈ పెంపు వుంటుంది తప్ప, పెద్దగా నిర్మాతకు భారీ అంకెలు కనిపించేంత సీన్ అయితే వుండదు. లోకల్ గా రెవెన్యూ జనాలను మేనేజ్ చేసుకుని యూనిఫారమ్ రేటు లాంటి వ్యవహారాలు చేసుకుంటే అది వేరే సంగతి.