ప్రేక్షకుల్లో అంత ‘తెగింపు’ కనిపించలేదు

చిన్నప్పుడు చదువుకున్న ఓ కథ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెండు పిల్లులు రొట్టె ముక్క కోసం కొట్టుకుంటాయి, న్యాయం చెబుతానంటూ మధ్యలో దూరిన కోతి ఆ రొట్టెను తినేస్తుంది. ప్రస్తుతం సంక్రాంతి సినిమాల…

చిన్నప్పుడు చదువుకున్న ఓ కథ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెండు పిల్లులు రొట్టె ముక్క కోసం కొట్టుకుంటాయి, న్యాయం చెబుతానంటూ మధ్యలో దూరిన కోతి ఆ రొట్టెను తినేస్తుంది. ప్రస్తుతం సంక్రాంతి సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. బంగారు బాతుగుడ్డు లాంటి సంక్రాంతి బాక్సాఫీస్ ఓపెనింగ్ ను అటుఇటు తిప్పి, చివరికి అజిత్ చేతిలో పెట్టారు.

ఇప్పటివరకు టాలీవుడ్ హిస్టరీలో అజిత్ నటించిన ఏ సినిమాకు దక్కనన్ని స్క్రీన్స్ తెగింపు సినిమాకు దక్కాయి. దొరికిన ప్రతి థియేటర్లలో 'తెగింపు' పడుతోంది. ఈ విషయంలో మేకర్స్ నిజంగానే తెగించారు. కానీ ప్రేక్షకులు మాత్రం అంత తెగింపు చూపించలేకపోయారు.

రేపు రిలీజ్ అవుతున్న తెగింపు సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ దారుణాతి దారుణంగా ఉంది. బుక్ మై షో లో ఈ సినిమాకు కనీసం 10శాతం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఇక్కడ అజిత్ కు క్రేజ్ తగ్గిందని చెప్పడం కంటే, ఈ సినిమాకు అస్సలు ప్రచారం చేయలేదని చెప్పడం సబబుగా ఉంటుంది.

అవును.. తెగింపు సినిమా రేపు వస్తుందనే విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు అస్సలు తెలియదు. ఆ రేంజ్ లో ప్రచారం చేశారు. దీంతో భారీగా థియేటర్లు దక్కినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ లేక ఈ సినిమా రిలీజ్ కు ముందే చతికిలపడింది.

ఇదే పరిస్థితి ఏ వీరసింహారెడ్డికో, లేక వాల్తేరు వీరయ్యకో వచ్చి ఉంటే మొదటి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించి ఉండేవి. కానీ వాటికి ఆ అవకాశం లేకుండా పోయింది. గురువారం నాటికి 'తెగింపు' కనీసం కొన్ని థియేటర్లలోనైనా కొనసాగుతుంది. దీంతో ఆటోమేటిగ్గా వీరసింహానికి థియేటర్లు తగ్గుతాయి.

ఈమధ్య కాలంలో ప్రతి సంక్రాంతి ఓపెనింగ్ ఓ డబ్బింగ్ సినిమాకే దక్కుతోంది. ఒక్క క్రాక్ సినిమా మాత్రం దీనికి మినహాయింపు. అలా కాకుండా, ఓ పెద్ద తెలుగు సినిమాతో సంక్రాంతి బాక్సాఫీస్ ఓపెన్ అయితే చాలా బాగుంటుంది. కానీ అలా జరగదు. ఎందుకంటే, మొదటి పారాగ్రాఫ్ లో చెప్పిన కథే రిపీట్ అవుతుంది కాబట్టి.