టీడీపీ, జనసేన పొత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ భేటీ తర్వాత జనసేన, టీడీపీ పంచుకునే అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు, అవి ఎక్కడెక్కడ అనే అంశం భారీగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా జనసేన బలమంతా కోస్తాలోనే అని మెజార్టీ అభిప్రాయం. అది కూడా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే కాపులు గెలుపోటములను నిర్ణయించే స్థితిలో ఉన్నారనే చర్చ నడుస్తోంది.
రాజకీయ పార్టీల అధికారాన్ని గోదావరి జిల్లాలే డిసైడ్ చేస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఆ సామాజిక వర్గ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే మెజార్టీ బలిజలు జనసేన లేదా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు కుదిరితే కోస్తాలో ఎక్కువ సీట్లను జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
అలాగే రాయలసీమలో కూడా ఉమ్మడి జిల్లాలను తీసుకుంటే కనీసం రెండు సీట్లు అడిగే అవకాశం వుందని జనసేన నేతలు చెబుతున్నారు. చిత్తూరు, తిరుపతి, మైదుకూరు, రాజంపేట, అనంతపురం,గుంతకల్లు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల అసెంబ్లీ సీట్లను అడుగుతున్నారని సమాచారం. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు ఎక్కువ. దీంతో జనసేనకు టీడీపీ బలం తోడైతే గెలుపు నల్లేరుపై నడక అనే అభిప్రాయంలో పవన్ పార్టీ నేతలున్నారు.
టికెట్ ఆశిస్తున్న జనసేన నేతలు టీడీపీతో ఎప్పుడెప్పుడు పొత్తు కుదురుతుందా? అని ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే గెలుపు ఖాయమనే ధీమాలో వారు ఉండడం వల్లే… పవన్, చంద్రబాబు భేటీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం కాలం ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో!