ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను గౌరవప్రదంగా ఎమ్మెల్యేని చేశారు. గౌరవంగానే చూసుకుంటున్నారు. ఆయన తండ్రి ప్రభుత్వం గురించి నానా నిందలు వేసినా, మా తండ్రి మాటలతో నాకు సంబంధం లేదు అంటూ ఆయన నంగిగా సెలవిచ్చినా జగన్ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా ఆయన గౌరవానికి భంగం కలగకుండానే చూసుకుంటున్నారు. కానీ.. ఆయన మాత్రం అదేపనిగా రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీనుంచి పోటీ చేయాలనే ఆలోచన లేనట్టుగా.. పార్టీ మీద, ప్రభుత్వం చాలా నిందలు వేస్తున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
ఆయన కుటుంబంలో తెలుగుదేశం మూలాలు ఉన్నప్పటికీ.. జగన్ ఆయనను ఎమ్మెల్యే చేసి గౌరవంగానే చూసుకుంటూ వచ్చారు. కృష్ణప్రసాద్ కు స్థానికంగా మరో ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ తో విభేదాలున్నాయి. జోగి రమేష్ కు మంత్రిగా ప్రాధాన్యం దక్కడాన్ని ఆయన సహించలేకపోతుంటారు. జోగి రమేష్ తన నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టి పనిచేసుకోనివ్వడం లేదంటూ అనేకమార్లు అంతర్గత వ్యవహారాన్ని రచ్చకీడ్చారు. అయినా సరే.. జగన్ ఆయన పట్ల ఎన్నడూ సీరియస్ గా స్పందించలేదు.
నిజానికి జగన్ స్వయంగా పూనుకుని మైలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి.. పరిస్థితుల్ని సమీక్షించారు. అందరికీ సర్ది చెప్పారు. కలిసి పనిచేసుకోవాలని.. పార్టీ విజయానికి పనిచేయాలని హితవు చెప్పారు. వసంత కోటరీకి చెందిన కొందరు పనిగట్టుకుని.. సీఎంతో జోగి రమేష్ మీద పితూరీలు చెప్పడానికి ప్రయత్నించగా.. జగన్ సర్దిచెప్పారు. మనం తయారుచేసుకుని బీసీ నేతను బద్నాం చేయవద్దని అన్నారు.
వసంత కృష్ణప్రసాద్ గతంలో.. ‘కావాలంటే నా నియోజకవర్గంలో ఇంకో ఇన్చార్జిని నియమించుకోండి..’ అంటూ రెచ్చిపోయి డైలాగులు వేసినప్పటికీ.. జగన్ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఉద్దేశం లేని కొందరు ఎమ్మెల్యేల విషయంలో జగన్ అదే సెగ్మెంటులో మరొక పార్టీ ఇన్చార్జిని నియమించారు. ఇలాంటి అనుభవాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ ఎన్ని ఎగస్ట్రా డైలాగులు వేసినా సరే.. జగన్ ఆయన పట్ల అలాంటి అగౌరవం కూడా చూపించలేదు.
కానీ వసంత ఇంకా రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పార్టీ మారదలచుకుంటున్నారో లేదా, రాజకీయాలే చాలించదలచుకుంటున్నారో తెలియదు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వచ్చేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పార్టీ తరఫున గెలిచి, ఎమ్మెల్యేగా హోదా అనుభవిస్తూ, ఆ పార్టీకే కీడుచేసే కుట్రఆలోచనలో వ్యవహరించడం మంచిది కాదని పలువురు అంటున్నారు.