కాపు, కమ్మ సామాజిక వర్గాలను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి గెలికారు. ఈ మేరకు ఆయన మరోసారి ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీపై ఇప్పటికే రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తమను కించపరిచేలా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ ఉందంటూ కొన్ని కాపు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వారిని వర్మ గెలుకుతూ ట్వీట్ చేయడం గమనార్హం.
“కాపులు – కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు – సేనలు ఇస్ నాట్ = ఓట్లు” అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లోని అర్థంపరమార్థం వర్మకు, కాపు, కమ్మ సామాజిక వర్గాలకు మాత్రమే తెలియాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన ట్వీట్‌కు అనూహ్య స్పందన రావడంతో, ఇదే అదునుగా భావించి ఆయన మరో అస్త్రాన్ని సంధించారు.
అసలే రాజకీయం వేడెక్కిన పరిస్థితిలో పానకంలో పుడకలా వర్మ తలదూర్చారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వర్మ గురించి చెప్పుకుంటారు. కాదేదీ వివాదానికి అనర్హమే ఉద్దేశంతో కాబోలు …చంద్రబాబు, పవన్ భేటీపై ఆయన ఓ కామెంట్ చేశారు. అది కాస్త వాత పెట్టినట్టైంది.
తనపై ఏవేవో విమర్శలు వస్తుండడంతో వర్మ కొనసాగింపు అన్నట్టుగా మళ్లీ ట్వీట్ చేయడం గమనార్హం. తాజా ట్వీట్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.